రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.. ఊహించని దానికంటే ఎక్కువ ఓట్లు ఆమె సాధించారు.. విపక్షాల అభ్యర్థికి షాక్ ఇస్తూ.. కొన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్ కూడా చేయడం చర్చగా మారింది.. అయితే, అభ్యర్థి విషయంలో ఎవరి ఊహకు అందని రీతిలో నిర్ణయం తీసుకుని విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ.. అనూహ్యంగా ద్రౌపది ముర్ముని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆదివాసి మహిళకు దేశ అత్యున్నతి పదవిని కట్టబెట్టింది.. కేంద్రంలో స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యా బలం బీజేపీకి ఉంది. అయినా సరే భాగస్వామ్య పక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. స్వపక్షం-మిత్రపక్షాల బలం కలుపుకుంటే… రాష్ట్రపతి ఎన్నికలో అధికార పక్షం అభ్యర్థి గెలుపు పెద్ద కష్టమైన పని కాదు. కానీ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ.. సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తున్న ద్రౌపది ముర్మను రాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సైతం ఒప్పించింది. ఆదివాసీ.. మరీ ముఖ్యంగా మహిళకు దేశంలో అత్యున్నత పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ సిద్ధం కావడంతో ప్రత్యర్థి శిబిరంలో బీటలు వారింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పలు ప్రాంతీయ పార్టీలు ద్రౌపది ముర్ముకు తమ మద్దతు ప్రకటించాయి.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయాలన్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నామంటూ పలు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని పెట్టేందుకు కృషి చేసిన పార్టీలు సైతం తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. తమ మద్దతు ద్రౌపది ముర్ముకే అని స్పష్టం చేశాయి. ఈ పరిణామం ప్రత్యర్థి శిభిరానికి గట్టి షాకే ఇచ్చింది. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులోకి దిగిన ద్రౌపది ముర్ము కూడా జోరుగా ప్రచారం చేశారు. ముర్ముకు వైసీపీ, టీడీపీ, బహుజన సమాజ్ పార్టీ, బిజూ జనతా దళ్, అన్నా డీఎంకే, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్ మద్దతు ఇచ్చాయి. అలాగే రాష్ట్రాల్లో పర్యటించి… ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టారామె. ద్రౌపది ముర్ముకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే విపక్ష కూటమిలో ఒకటైన జార్ఖండ్ ముక్తిమోర్చ-జేఎంఎం మనసు మార్చుకుంది. యశ్వంత్ సిన్హాను పక్కకు నెట్టి… తమ మద్దతు ద్రౌపది ముర్ముకేనని స్పష్టం చేసింది. రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం పట్టుదలగా పని చేసిన మమతా బెనర్జీ సైతం… ముర్ముకు అనుకూలంగా మాట్లాడారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు ముందే చెబితే.. తాము సైతం ఆమెకే మద్దతు తెలిపే వాళ్లమంటూ మనసు మాట చెప్పారు మమత. కర్ణాటకలోని జేడీఎస్ కూడా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావల్సిన అవసరం ఎంతైన ఉందని అభ్రిపాయపడింది. రాష్ర్టపతి ఎన్నికలో ముర్ముకే ఓటేయాలని జేడీఎస్ నేతలకు సూచించారు మాజీ ప్రధాని దేవెగౌడ. ముర్మును రాష్ట్రపతి బరిలోకి దించడం ద్వారా దళితులు, ఆదివాసాలను ఒక్క సారిగా తమ వైపునకు తిప్పుకుంది బీజేపీ. వచ్చే రెండేళ్లలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ఎన్నికల్లో ఆదివాసీల ఓట్లను బీజేపీని కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా బీజేపీ వ్యూహంలో విపక్షాలు ఉక్కిరిబిక్కిరైపోయాయి.