ఆత్మకూరు ఉప ఎన్నికకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 148 మంది మైక్రో అబ్జర్వర్ల నియామకం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు. నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు భద్రతలో వున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకి ఉప ఎన్నిక అనివార్యం అయింది. వైసీపీ, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. టీడీపీ గత సంప్రదాయాలను అనుసరించి పోటీ చేయడం లేదు. 2019లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో వున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా వుండడం విశేషం, మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు సాయంత్రానికల్లా చేరుకుని సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత అమలులో వుంది.