హైకోర్టులో జగన్‌ సర్కార్‌కు మరో షాక్.. కక్ష పూరితంగానే జాస్తి కృష్ణ కిషోర్ పై కేసు..!

0
83

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది.. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు అక్రమమే అని తేల్చింది న్యాయస్థానం.. ఈడీబీ సీఈవోగా కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని పేర్కొంది.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చెయ్యడమే కాకుండా క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. అయితే, తన సస్పెన్షన్ పై కృష్ణ కిషోర్ క్యాట్ ను ఆశ్రయించగా, సదరు ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.. అనంతరం కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత విచారించిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పునిచ్చింది. ఆ తర్వాత కృష్ణ కిషోర్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో పెట్టిన సెక్షన్ లు చెల్లవని కేసును క్వాష్ చేసింది.. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గానీ, లాభ పడినట్లు గానీ ఎక్కడా అధారాలు లేవని తేల్చి చెప్పింది హైకోర్టు.

అంతే కాకుండా సీఎం జగన్ పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా కృష్ణ కిషోర్ పై కేసు పెట్టినట్లు హైకోర్టు నిర్థారణకు వచ్చింది… భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టి వేయదగినదిగా హైకోర్టు భావించింది.. కృష్ణ కిషోర్ హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ సర్కిల్ లో పని చేసిన సమయంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు ఇచ్చారు.. అయితే, దాన్ని మనసులో పెట్టుకుని కక్షసాధింపుగా అధికారంలోకి వచ్చిన తర్వత తనను సస్పెండ్ చేసి తప్పుడు కేసు బనాయించినట్లు తన పిటిషన్ లో కృష్ణ కిషోర్ పేర్కొన్నారు.. మొత్తంగా హైకోర్టులో జాస్తి కృష్ణ కిషోర్‌కు ఊరట దక్కగా.. మరోసారి వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు షాక్‌ తగిలినట్టు అయ్యింది.. కాగా, చంద్రబాబు హయాంలో పనిచేసిన కొందరు అధికారుల విషయంలోనూ సస్పెన్షన్లు, కేసులతో జగన్‌ సర్కార్‌ చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here