ఏపీ సీఎం జగన్ ఈనెలాఖరులో ప్యారిస్ వెళ్లాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పాటు ప్యారిస్‌లో వ్యక్తిగతంగా సీఎం జగన్ పర్యటిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. దీంతో సీఎం జగన్ ప్యారిస్ ఎలా వెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కానీ సీఎం జగన్ ఈనెల 28న రాత్రి ప్యారిస్‌కు బయలుదేరతారని సీఎంవో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు తన కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. అయితే జగన్ ప్యారిస్ టూర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్యారిస్ వెళ్లేందుకు సీఎం జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి ఎప్పటికప్పుడు జగన్ విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్ ప్యారిస్‌కు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు నుంచి అనుమతి రాకముందే పర్యటన ఖరారు కావడంపై అసలు జగన్ పర్యటన కొనసాగుతుందా లేదా అన్న అంశంపై పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.