ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా సీఎం జగన్ సమీక్షలు చేపడుతున్నారు. విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్), డిజిటల్ లెర్నింగ్ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై సీఎం సమీక్ష చేపట్టారు. తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణకు ఆదేశాలిచ్చారు. బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై చర్చ జరిగింది.
సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందచేస్తామన్నారు జగన్. ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలి. దీనికి తగినట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలి. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్ విద్యార్థి 9, 10 తరగతుల్లో కూడా పని చేయాలి. తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇప్పటికే డిజిటల్ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలని ఆదేశించారు. వీటి వల్ల సైన్స్, మాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా అర్థం అవుతాయి. టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది. జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.