ఇటీవల సీపీఎం నాయకులు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యల మీద ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం సీపీఎంకు తగదన్నారు. సామాజిక న్యాయం ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ముర్మును బలపరుస్తోందన్నారు. ఒక గిరిజన మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపితే, సీపీఎం విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. దేశంలో ఎప్పుడో భూస్థాపితమైన సీపీఎం నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.
తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే సీపీఎం విమర్శలు చేస్తోందని, సీపీఎం మహిళా, గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న ఎన్డీయేను విమర్శించే అర్హత కమ్యూనిస్టు నాయకులకు ఏమాత్రం లేదన్నారు. ఎన్డీఏయేతర పక్షాలైన జార్ఖండ్ జేఎంఎం పార్టీ నేత హేమంత్ సోరెన్, ఒరిస్సా బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ ,కర్ణాటక జనతాదళ్ (యస్) దేవేగౌడ గారు ఇంకా అనేక పార్టీలు మద్దతు ఇస్తున్న విషయాన్ని కమ్యూనిష్టులకు కనపడలేదా..? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవి ఎన్నికలను సైతం వామపక్షాలు రాజకీయం చేయడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు.