తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్‌లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన గూండాల చేతిలో పలువురు మా పార్టీ నేతలు ప్రాణాలు పోయాయని మండిపడుతోంది టీడీపీ.. తాజాగా, మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై దాడికి పాల్పడ్డారు దుండగులు.. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో గొడ్డళ్లతో బాలకోటిరెడ్డిపై దాడికి చేశారు ప్రత్యర్థులు.. తీవ్రగాయాలపాలైన బాలకోటి రెడ్డిని వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.. వివిధ టెస్ట్‌లు నిర్వహించిన డాక్టర్లు.. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు.. కాగా, గతంలో రొంపిచర్ల ఎంపీపీగా కూడా పనిచేశారు వెన్న బాల కోటిరెడ్డి. అయితే, ఇది ముమ్మాటికి వైసీపీ గూండాల పనే అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు? అని నిలదీశారు.. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని ప్రశ్నించారు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న బాలా కోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హత్యలు, దాడులతో టీడీపీ కేడర్‌ని భయపెట్టాలనుకుంటున్న జగన్ పాపాలు.. శిశుపాలుడి పాపాల్లా పండిపోయాయి అని మండిపడ్డారు నారా లోకేష్.. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం చేయిస్తోన్న హత్యలు, దాడులే జగన్ పతనానికి దారులుగా అభివర్ణించారు.. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ వైసీపీ గూండాల పనేనని ఆరోపించారు.. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత అవుతుందన్న ఆయన.. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే.. వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్థం అవుతోందన్నారు.. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్‌లోనే వున్న జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇకనైనా హత్యా రాజకీయాలు, దాడులు ఆపండి.. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి.. జగన్ అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకి ఇదే చివరి హెచ్చరిక అన్నారు. మేం తిరగబడితే, వైసీపీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు? అని లోకేష్ ప్రశ్నించారు.
మరోవైపు.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై దాడి ఘటనను ఖండించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇది వైసీపీ రౌడీల పనేనని ఆరోపించిన ఆయ.. సీఎం జగన్ ఫ్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని.. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీ మూకల్ని హెచ్చిరిస్తున్నాం.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ గుండాలకు ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే పథకం అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ఇప్పుడు మీరు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అచ్చెన్నాయుడు.