మద్యం అమ్మకాలు తగ్గాయి.. అధిక రేట్లే కారణమన్న సీఎం జగన్

0
736

ఏపీలో ఖజానాకు ఆదాయం సమకూర్చిపెట్టే శాఖలపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించారు సీఎం. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని తెలిపారు అధికారులు. 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.31లక్షల కేసులు కాగా, 2021–22లో 278.5 లక్షలకు తగ్గిందని తెలిపారు. 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందన్నారు. 2018–19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లు కాగా, 2021–22లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా పేర్కొన్నారు అధికారులు.

రేట్లు షాక్‌ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు సీఎం. బెల్టు షాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో వినియోగాన్ని బాగా నియంత్రించామన్నారు సీఎం. లీకేజీలు లేకుండా, పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సీఎం ఆదేశాలిచ్చారు. గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని తెలిపారు అధికారులు. ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్‌ చేశామన్నారు అధికారులు. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు అధికారులు.

నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. స్వయం ఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ప్రతి కాలేజీ, యూనివర్శిటీల ముందు ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్న సీఎం…ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదని ఆదేశించారు.

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందకు సాగాలన్నారు. మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు వారికి అందించాలన్నారు. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయిసాగుపై దాడులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే వివిధ పంటలకు సంబంధించి విత్తనాలు అందించామన్నారు అధికారులు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here