ఆదోనిలో జగన్ పర్యటన.. విద్యాకానుక పంపిణీకి రంగం సిద్ధం

0
631

ఈరోజు సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనీలో పర్యటించనున్నారు. ఆదోనీలో జరిగే సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగించనున్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠ‌శాల‌లో చ‌దివే విద్యార్థుల‌కు ఈ నెల 5వ తేదీ మంగ‌ళ‌వారం జ‌గ‌న‌న్న విద్యా కానుక కిట్ల‌ను పంపిణీ చేస్తున్నారు. విద్యా కానుక కిట్ల పంపిణీకి ఆదోని మున్సిపల్‌ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి నాడు నేడు కింద రూ. వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలతో విద్యార్ధుల చేరికలు భారీగా పెరిగాయి.

విద్యపై పెట్టే వ్యయం విద్యార్ధుల భవిష్యత్‌కు పెట్టుబడి అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్‌ జగన్‌ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక క్రింద ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ కుట్టుకూలితో సహా అందిస్తారు. ఒక జతల బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి విద్యార్థికి రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here