చిరంజీవికి నారాయణ క్షమాపణలు.. నన్ను వదిలేయండి ప్లీజ్‌..!

0
193

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మెగాస్టార్‌ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.. నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మెగా బ్రదర్‌ నాగబాబు.. నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు.. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి… కాస్త అన్నం పెట్టండి …! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.. దీంతో, వివాదం మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన నారాయణ.. మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు.

తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలు భాషా దోషంగా భావించాలని విజ్ఞప్తి చేశారు నారాయణ.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండి అని కోరారు.. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు, సద్విమర్శలు చేస్తుటాం.. చిరంజీవి గతంలో రాజకీయాల్లో ఉన్నారు.. రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలి.. కానీ, నేను ఆ పరిధి దాటి వ్యాఖ్యలు చేశాను.. అనకూడని మాటలు అన్నానని.. ఆయనపై తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నారు నారాయణ.. ఇక, వరద బాధితులను ఆదుకోవడం కోసం అందరూ కలిసి పని చేద్దాం.. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని దుయ్యబట్టిన నారాయణ.. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వరద వివాదానికి కారణంగా పేర్కొన్నారు.

అయితే, తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. చేసిన వ్యాఖ్యలు వివాస్పదంగా మారాయి.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరుకావడాన్ని తప్పుబట్టిన ఆయన.. చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని పేర్కొన్నారు.. చిల్లర బేరగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని మండిపడ్డ నారాయణ.. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు నారాయణ.. అయితే, మెగా బ్రదర్స్‌పై నారాయణ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్‌తో పాటు జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం.. నాగబాబు కూడా రంగంలోకి దిగడంతో.. ఇక చేసేది ఏమీ లేక.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు నారాయణ. మరి ఈ వివాదానికి ఇంతటితో తెరపడుతుందా..? లేదా? అనేది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here