ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించండి.. సీపీఎం డిమాండ్

0
963

ఏపీలో శుక్రవారం నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. దీంతో ఛార్జీలను తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఏపీ ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే పన్నులు, విద్యుత్ భారాలతో ప్రజలు అల్లాడుతున్నారని.. ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని.. 30 కి.మీ. దాటి ప్రయాణం చేసే అందరిపైనా ఈ ఛార్జీల భారం పడుతుందని ఆరోపించారు. గతం కంటే డీజిల్ ఛార్జీలు తగ్గినా.. మళ్లీ సెస్ ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త పాలనకు ఈ భారాలు నిదర్శనమన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అన్ని రకాలుగా జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తుందన్నారు. ప్రజల ఆదాయాలపై పన్నులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నెలలో ఒకరోజు ఇంటింటికీ సీపీఎం పేరుతో యాత్ర చేస్తున్నామని.. ఎక్కడకెళ్లినా ప్రజలు ఈ ప్రభుత్వం నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఇళ్ల నిర్మాణాలపై భారాలు మోపారని.. ఎవరైనా ప్రశ్నిస్తే..‌ వాలంటీర్ల ద్వారా పథకాలు అపేస్తామని బెదిరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ కార్యకర్తలే.. వాలంటీర్లుగా పని చేస్తారని మంత్రులే చెబుతున్నారన్నారు. ఈ రకమైన వ్యవస్థను దుర్వినియోగం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. ఈనెల 11న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అటు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు మంత్రిగా చేశారని.. అప్పుడు ఆదివాసీలపై పోలీసులు కాల్పులు జరిపితే కనీసం ఖండించలేదన్నారు. సొంత గ్రామానికి ఆమె విద్యుత్ కూడా ఇప్పించలేక పోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఇటువంటి వారు రాష్ట్రపతిగా ఏం‌ పని చేస్తారని ప్రశ్నించారు. ఆదివాసీ పేరుతో ఓటు బ్యాంకు కోసమే ఇటువంటి జిమ్మిక్కులు చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ఏ విధంగా బీజేపీకి మద్దతు ఇస్తారని నిలదీశారు. ఏయే హామీలు లభించాయో జగన్ ప్రజలకు చెప్పాలన్నారు. జులై 4న భీమవరం వస్తున్న మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. ఏపీకి చేసిన అన్యాయంపై మోదీ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం లేని‌ పార్టీ బీజేపీ అని.. ఆ పార్టీకి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేసే అర్హత కూడా లేదన్నారు. బీజేపీని బలపరుస్తున్న సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని.. రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.టీడీపీ కూడా మౌనం వీడి బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహారాష్ట్ర ఉదంతం చూసైనా ఏపీలో వైసీపీ, టిడీపీలు మేల్కొనాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here