జనసేనాధినేత పవన్ కల్యాణ్ మీద డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్లినరీ సమావేశాలకు హాజరైన ఆయన.. పవన్ కళ్యాణ్ ను 175 స్థానాల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ కోసమే పవన్ పొత్తులు పెట్టుకున్నారని, ఎంతమంది కలిసొచ్చిన మీకు డిపాజిట్ కూడా రాదంటూ ఎద్దేవా చేశారు. కోటీశ్వరుడిలా బస్సు యాత్ర వద్దు… పేదవాడిలా పాదయాత్ర చేయగలవా అంటూ సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలు ఆపేస్తామని పవన్ కల్యాణ్ చెప్పగలడా? అని ప్రశ్నించారు. సినిమాల్లో ఉండేది కేవలం గ్రాఫిక్స్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. తిరుగులేని నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, రాష్ట్రంలో రామ రాజ్యం కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ను.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే 2024లో వైకాపాను గెలిపిస్తాయన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని ప్రధాని పదవి అలంకరించే అవకాశం ఉందని, 2024లో టీడీపీ, జనసేన పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఓట్లు అడిగే హక్కు తెలుగు దేశం పార్టికి లేదని చెప్పిన నారాయణ స్వామి.. పవన్ కల్యాణ్ కాదు, ‘కల్యాణం’ అంటూ సెటైర్లు వేశారు.