చంద్రబాబు పర్యటనలో అపశృతి.. గోదావరి తల్లి దయతో బతికి బట్ట కట్టాం..!

0
116

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు కొందరు గోదావరి నది వరద నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని రక్షించారు.. ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు..

ఇక, ఈ ఘటనలో గోదావరిలో పడిపోయిన.. మాజీ మంత్రి దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ.. ఒడ్డుకు చేరాలని కంగారులో అంతా పంటే నుంచి పడవ వైపు రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.. అయితే, గోదావరి తల్లి దయ చూపడంతో బతికి బయట పడ్డాం.. ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఉందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. కాగా, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటులో నుంచి దిగి రాజోలు లంక వెళ్లేందుకు పడవలోకి మారారు.. మర పడవలో చంద్రబాబు వెళ్లగా.. ఆయనతో పాటు మరో పడవలో టీడీపీ నేతలు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. అందరూ ఒక్కసారిగా పంటు చివరకు రావడంతో అదుపుతప్పి మరో బోటును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.. అంతా సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here