పులుల సంతతి పెంచాలని అటవీ శాఖ భావిస్తోంది. అందుకే కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి నో ఎంట్రీ జోన్ పెట్టారు. మానవ అడుగు చప్పుళ్ళు కూడా వినిపించరాదు….పెద్ద పులుల రొమాన్స్ కి ఎలాంటి అంతరాయం కలగకూడదంటే ఎలాంటి శబ్దాలు, మానవ సంచారం ఉండకూడదు. అందుకే నల్లమల అడవిలో ఇపుడు సైలెన్స్ సీజన్ నడుస్తోంది. దేశంలో పెద్ద పులుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. అందుకు అనేక కారణాలు. పెద్ద పులుల పాపులేషన్ పెంచేందుకు వాటికి ఏకాంత వాతావరణం కావాలి. అందుకు ఆటవీశాఖ పెద్దపులులు సంగమించే కాలంలో వాటికి ఏకాంతంగా ఉబడే పరిస్థితులు కల్పిస్తున్నారు. నల్లమల అభయారణ్యం పెద్ద పులుల అవాసానికి అనుకులమైంది. అందుకే నల్లమల అడవిలో పెద్ద పులుల సంఖ్య పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నల్లమలలో పర్యాటక కేంద్రాలు, ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీ శాఖ అనుమతులు నిరాకరించింది. పెద్ద పులులు ఏకాంతంగా రొమాన్స్ లో మునిగిపోవాలని…పులుల పునరుత్పత్తికి అవకాశం కల్పించాలని అటవీ శాఖ నానా పాట్లు పడుతోంది.
పెద్ద పులి అంటేనే మనమంతా భయపడతాం. పెద్ద పులి నడక, ఠీవి మామూలుగా ఉండదు. కానీ దానికి చాలా సిగ్గు. పెద్ద పులి ఆడ పులితో రొమాన్స్ చేయాలంటే ఏకాంతం కావాలి. రెండు పులులు సంగమించే సమయంలో చిన్న అలికిడి వినిపించినా రొమాన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. ఈ లక్షణం కూడా పులుల సంఖ్య పెరగకపోవడానికి ఓ కారణం. పులుల రొమాన్స్ కి ఇది సరైన సీజన్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు పులుల సంగమించేందుకు ఇష్టపడే కాలం. అందుకే అటవీ శాఖ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు నల్లమలో పర్యాటక కేంద్రాలు, ఇష్టకామేశ్వరి అలయానికి అనుమతులు నిరాకరించింది. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2015 నుంచి ఇది అమలులో ఉంది. అడవుల్లో తరచూ మానవ సంచారం కారణంగా పెద్ద పులులు సంగమించడం తగ్గిపోయి పునరుత్పత్తి తగ్గిందని ఒక అంచనా.
పెద్ద పులుల గర్భధారణ తగ్గిపోవడానికి మానవ సంచారం కూడా ఒక కారణమని జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు శాస్త్రీయంగా చెబుతున్నారు. పెద్ద పులులు సంగమించే కాలంలో వాటి ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది. సంగమ సమయంలో ఆవేశంతో ఉంటాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే దాడి చేసే అవకాశాలు ఎక్కువ. సంగమ సమయంలో పెద్ద పులులు తన టెర్రిటరీలో ఇతరుల ప్రవేశాన్ని అంగీకరించవు. దీంతో పెద్ద పులులకు ఏకాంత వాతావరణం కల్పించేందుకు జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు నల్లమల అడవిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.