టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోకస్ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గంజి చిరంజీవి టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. ఇన్నాళ్లు నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఋణపడి ఉంటాను.. కానీ, టీడీపీలో బీసీగా ఉన్న నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.. 2014లో నా ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
ఇక, టీడీపీ వాళ్లే నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గంజి చిరంజీవి.. చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాదే అని చెప్పి మోసం చేశారన్న ఆయన.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి నన్ను మంగళగిరి ప్రజలకు దూరం చేశారన్నారు.. చేనేత, బీసీగా ఉన్న నన్ను అణగదొక్కారు.. నా ఆవేదన బాధ నాయకులకు తెలిసినా నన్ను పట్టించుకోలేదన్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే నడుస్తాను.. అందరిని సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు గంజి చిరంజీవి. కాగా, 2014లో టీడీపీ నుంచి మంగళగిరి స్థానానికి బరిలోకి దిగిన గంజి చిరంజీవికి.. 2019 ఎన్నికల్లో మాత్రం సీటు దక్కలేదు.. ఆ స్థానం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీకి దిగిన విషయం తెలిసిందే.. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమైన లోకేష్.. పర్యటనలు, కార్యక్రమాలను కూడా పెంచారు.. ఈ నేపథ్యంలో.. మరోసారి తనకు అవకాశం రాదని భావించిన గంజి చిరంజీవి.. మొత్తానికి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.