తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తప్పేలా లేదు.. పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. అయితే, గంటా శ్రీనివాస్‌రావు.. టీడీపీని వీడతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది.. కానీ, ఇప్పుడు గంటా ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారట.. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మరడంపై సందిగ్ధత వీడిపోయిందని.. ఈ డిసెంబర్లోనే ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరనున్నట్టు తన సన్నిహితుల దగ్గర గంటా శ్రీనివాస్‌రావు చర్చించినట్టుగా సమాచారం.. అయితే, పార్టీని వీడేకంటే ముందు మెగాస్టార్ చిరంజీవితో ఆయనే సమావేశం కానున్నారట.. హైదరాబాద్ వెళ్లనున్న గంటా శ్రీనివాస్‌రవు.. చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరారు..
ఇక, డిసెంబర్ 1వ తేదీన గంటా శ్రీనివాస్‌రావు పుట్టిన రోజు ఉంది.. ఆ వేడుకల తర్వాత.. వైసీపీలో చేరనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యే బహిరంగ సభ వేదికపైనే గంటా శ్రీనివాసరావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే దిశగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే, గంటా శ్రీనివాస్‌రావుకు మెగాస్టార్ చిరంజీవితో ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. చిరు కూడా ఆయన్ను సొంత సోదరుడిలా చూసుకుంటారు. అనేక సందర్భాల్లో వీరిద్దరు కలిశారు. అంతేకాదు, గంటా శ్రీనివాస రావు 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీలో చేరారు. 2014 నుంచి 2019 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన వారిలో గంటా కూడా ఒకరు..
మరోవైపు, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక.. టీడీపీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనడంలేదు గంటా శ్రీనివాస్‌రావు.. దాంతో, ఆయన టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది.. దానికి మరింత బలం చేకూర్చే విధంగా ఆయన చేష్టలు కూడా ఉన్నాయి.. చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలో.. గంటా కనిపించని సందర్భాలు ఉన్నాయి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటాతో భేటీకి చంద్రబాబు కూడా ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలతో ఈ ఏడాది మే నెలలో చంద్రబాబు సమావేశమయ్యారు. గంటాకు కూడా ఆహ్వానం పంపినా.. అనారోగ్య కారణాలతో తాను సమావేశానికి రాలేనని ఆయన తెలియజేశారట.. ఇలా ఎన్నోసార్లు ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటంలో తాను సైతం అన్నారు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. లేఖను కూడా స్పీకర్‌కు పంపారు.. అయితే, అది పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఇక ఫైనల్‌గా వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దానికి ముందే చిరంజీవిని కలిసి.. ఆయనతో చర్చించిన తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవసరం అయితే, తప్పుడు పవన్ కల్యాణ్ కోసం అన్న విధాలుగా సాయం అందిస్తానని చెప్పిన చిరంజీవి.. గంటా విషయంలో ఏం చెబుతారో చూడాలి మరి.