రైతులకు గుడ్ న్యూస్.. గోదావరికి భారీగా వరదనీరు

0
188

గోదావరి నది నిండుకుండలా జలకళతో కళకళలాడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగి గోదావరికి వరద నీరు వచ్చిందా? అన్నంత సందడి నెలకొంది. కొద్ది రోజులు క్రితం వరకు గోదావరిలో నీళ్లు ఒట్టిపోయి ఇసుక తెన్నులు కనిపించి త్రాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితులను తలదన్నేలా నీటి ప్రవాహం సాగడం కనువిందు కలిగిస్తోంది.

రాజమండ్రి వద్ద గోదావరి నదిలో జల కళ మొదలైంది. నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.7 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుండి మూడు డెల్టా కాల్వలకు 9 వేల 180 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్ నీటిమట్టం పెరుగుతోంది. గత నెల ఒకటవ తేదీ నుండి ధవళేశ్వరం బ్యారేజీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు గోదావరి జలాలను విడుదల చేశారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు.

ముందస్తు ఖరీఫ్ సాగు నిమిత్తం ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వ్యవసాయ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఈచర్యలు తీసుకున్నారు. అయితే రైతులు సాగుకు సన్నద్ధమయ్యే లోపే గోదావరిలో నీటి నిల్వలు అడుగంటాయి. కొద్దిరోజులుగా తాగు, సాగు, పరిశ్రమల అవసరాలకు నీటి కోసం కటకట ఏర్పడే పరిస్థితులు ఎదుర్కొన్నారు. గోదావరి నీరు లేక వెలవెలబోయింది. వర్షాభావం పరిస్థితులతో నదిలో నీటిమట్టం గణనీయంగా పడిపోయాయి. ఈనెల ఒకటి నుండి గోదావరి జిల్లాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నీరు భారీగా గోదావరిలోకి వచ్చి చేరుతుంది. గోదావరి నీటిమట్టం కనిష్ఠ స్థాయిలోకి పడిపోవడంతో ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు బ్యారేజీకి ఉన్న 175 గేట్లు మూసివేసి ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న నీటిని నిల్వ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here