మోడీకి పవన్‌ కల్యాణ్‌ వినతి.. అది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుంది..

0
118

భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు.. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులని పేర్కొన్న పవన్.. కర్తవ్య పథ్‌ అనేది భారతీయత ఉట్టిపడే నామ ధేయం.. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది.. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను తుడిచేయడం సంతోషించాల్సిన విషయం అన్నారు.. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో వలస వాద పాలనలో ఉద్భవించిన పేర్లు మరియు చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.. ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయమన్నారు.

ఇక, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జపాన్ లో భద్రపరచిన నేతాజీ అస్థికలను కూడా రప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమరాలు రాజశ్రీ చౌదరీ బోస్ గారి అనుమతితో ఆమె డీఎన్‌ఏతో వాటిని సరిపోల్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందని.. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందన్నారు పవన్‌ కల్యాణ్‌. కాగా, దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్ల‌మెంటు, రాష్ట్రప‌తి భ‌వ‌న్, ఇండియా గేట్‌ ప‌రిస‌రాల్లో ఇన్నాళ్లు రాజ్‌ప‌థ్‌గా కొన‌సాగిన చారిత్రక నిర్మాణం.. క‌ర్త‌వ్య ప‌థ్‌గా మారిన విషయం తెలిసిందే.. రాజ్‌ప‌థ్‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాల‌ను చేరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దింది.. అంతేకాకుండా క‌ర్త‌వ్య ప‌థ్‌లోనే 25 అడుగుల ఎత్తైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేశారు. గురువారం నేతాజీ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here