ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ అప్పుడే..! తేల్చేసిన కొడాలి నాని

0
135

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ తర్వాత రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. అయితే, టాలీవుడ్‌ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. లక్ష్మీపార్వతి అడిగారనో.. నేను అడిగాననో.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వెళ్లి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోరన్న ఆయన.. ఆయనకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, తీసుకోగలను అనుకున్నప్పుడు.. తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుంటారని.. దానికి తొందరెందుకు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేస్తాయన్నారు కొడాలి నాని.. అయితే, ఎన్టీఆర్‌ టీడీపీ పగ్గాలు తీసుకోవడంతో.. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకొని.. బాబు పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరికీ డిపాజిట్లు కూడా రావన్న ఆయన.. ఈ రాష్ట్రానికి 2024 ఎన్నికల్లో ఆ ఇద్దరి (చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌) పీడ విరగడవుతుందని జోస్యం చెప్పారు కొడాలి నాని.

ఇక, 2024 ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్‌ కాగ్రెస్‌ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుందన్నారు కొడాలి నాని.. ఓవైపు తెలుగుదేశం-బీజేపీ కూటమిని.. మరోవైపు చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ కూటమని కూడా జగన్మోహన్‌రెడ్డి ఓడిస్తారని.. 2024 ఎన్నికలే ఆ పార్టీలకు చివరి ఎన్నికలు అవుతాయన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. కాగా, తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను… శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ కలిశారు.. షా-ఎన్టీఆర్‌ మధ్య జరిగిన డిన్నర్‌ భేటీ ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది.. ఇక, ఈ భేటీపై కొడాలి నాని గతంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుంటే ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని పేర్కొన్న ఆయన.. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారని.. ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ కాబట్టి.. దేశవ్యాప్తంగా ఆయన సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు.. అంతే కాదు.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండేతో ప్రభుత్వాన్ని మార్చినట్టు.. ఇక్కడ ఎన్టీఆర్‌తో తెలుగుదేశం పార్టీలో చేసే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపిన విషయం పేర్కొన్న విషం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here