మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. త్వరలోనే ఆయన వైసీపీ గుడ్‌బై చెప్పేసే.. సైకిల్ ఎక్కుతారా? అనే చర్చను లేవనెత్తుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్న ఆయన.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు. నేను గెలవడంతో పాటు మెజార్టీ సీట్లు సాధించేలా కృషి చేస్తానని ప్రకటించారు కొత్తపల్లి సుబ్బారాయుడు.. తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి ఏటా నా పుట్టిన రోజు ఘనంగా జరుగుతుంది.. బల ప్రదర్శన ప్రతి ఏటా ఉండేదే అన్నారు చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. 2024 ఎన్నికల్లో పోటీచేసేది ఖాయం.. తాను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయను అని ఎక్కడ చెప్పలేదన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు.. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.. ఇక, నియోజకవర్గం తరపున పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. కాగా, గతంలో తెలుగు దేశం పార్టీలో కీలకంగా పనిచేసిన ఆయన.. నర్సాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వరకు పోటీ చేశారు.. అయితే, 2019 ఎన్నికల్లో మాత్రమే ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.. అయితే, 2019లో ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యే విజయం సాధించారు.. అప్పటి నుంచి నరసాపురం నియోజకవర్గంలో ఇద్దరు నేతలకు పోసగడం లేదు అనేది బహిరంగ రహస్యమే.. అయితే, 2024 ఎన్నికల బరిలో ఉంటాను.. నర్సాపురం నుంచే పోటీ చేస్తానని.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేనని.. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని గతంలోనూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.