సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఎంత బరితెగిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కొందరిని టార్గెట్ చేస్తూ, కావాలనే అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటారు. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల్లో తమకు గిట్టని వారిపై, ఇష్టానుషారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇలా హద్దుమీరిన వారిలో కొందరికి అప్పటికప్పుడే సరైన గుణపాఠాలు నేర్పించారు. మళ్లీ అలాంటి తప్పుడు పనులకు పాల్పడకుండా, వారికి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు మరో వ్యక్తికీ అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని కృష్నా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి.. ఖమ్మం టేకులపల్లిలో ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. ఇతడు తన ఫేస్‌బుక్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా కించపరిచాడు. ఈ విషయం టీడీపీ నాయకులైన కేతినేని హరీశ్, నల్లమల రంజిత్, సున్నా నవీన్, వక్కంతుల వంశీలకు తెలిసింది. దీంతో వాళ్లు వెంటనే నరసింహకు ఫోన్ చేసి, నారా బ్రహ్మణిపై అలాంటి పోస్టులు ఎందుకు పెడుతున్నావని, ఎక్కడున్నావని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాను ముస్తఫానగర్‌లో ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఉన్నానని నరసింహా చెప్పాడు. దాంతో వాళ్లు అక్కడికి వెళ్లారు.
కార్యాలయానికి చేరుకున్న అనంతరం టీడీపీ నాయకులు, నరసింహ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు అలాంటి పోస్టులు పెడుతున్నావంటూ అడిగితే, అతడు దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నాయకులు.. నరసింహను పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.