వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం.. మావోయిస్టుల లేఖ

0
770

భద్రాద్రి కొత్త గూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారని, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని లేఖలో పేర్కొంది.

ఇరు రాష్ట్రాల్లో గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కోసం లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. బీకే-ఏ.ఎస్.ఆర్. కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. భారీవర్షాలు, గోదావరి వరదల వల్ల వేలాదిమంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావం వల్ల ఇళ్ళను కోల్పోయారు. ఇదిలా వుంటే.. వరద నష్టంపై అధ్యయనానికి కేంద్ర బృందం రానుంది. ఢిల్లీ నుంచి తెలంగాణకు 6 గురు సభ్యుల బృందం రాబోతోంది. వరదల నష్టాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది బృందం. 2 రోజుల పర్యటనలో భద్రాచలం, కడెం ప్రాజెక్టులను పరిశీలించనుంది కేంద్ర బృందం.

మరోవైపు భారీ వర్షాలకు, వరదలకు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. గోదావరి నది పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. రోడ్లు, భవనాలు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణలో రూ. 1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక కూడా అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here