మెగా బ్రదర్స్.. అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పడుతుంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ నాగబాబు, పవన్‌కళ్యాణ్ తమ అన్న మెగాస్టార్ చిరంజీవి పేరును గొప్పగా ప్రస్తావిస్తుంటారు. ఆయన వల్లే తాము ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటూ పది మందిలో సంతోషంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరిలో నాగబాబే ఎక్కువగా చిరంజీవి గురించి, “చిరంజీవి తరఫున” అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయన చేసే వ్యాఖ్యలు చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
అన్నయ్యకు చెడ్డ పేరు తేవాలనేది నాగబాబు ఉద్దేశం కాకపోయినా ఆయన కామెంట్లకు పరోక్షంగా అదే (ప్రతికూల) అర్థం వస్తోంది. ఉదాహరణకు మొన్నటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్నే తీసుకుందాం. ఆ ప్రోగ్రామ్‌లో తన సోదరుడు చిరంజీవి తప్ప అందరూ బాగా నటించారని నాగబాబు విమర్శించాడు. ఆయన వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేశాడా లేక జనసేన పార్టీ నాయకుడిగా చేశాడా అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే మెగాస్టార్ ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలోనూ యాక్టివ్‌గా లేడు. కాబట్టి ఆయన్ని రాజకీయాల్లోకి లాగకూడదు.
మెగాస్టార్ క్రియాశీలక రాజకీయాల్లో లేకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ని ఆ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించి గౌరవించాయి. మామూలుగా అయితే ఆ ప్రోగ్రామ్‌కి చిరూని పిలవాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే అల్లూరిని తన సినిమా ద్వారా మరింత మందికి చేరువ చేసిన సూపర్ స్టార్ కృష్ణని ఇన్వైట్ చేయాల్సింది. ఆయన్ని పిలిచారా, పిలిచినప్పటికీ వయసు రీత్యా రాలేకపోయారా అనేది తెలియదు. అదే సమయంలో చిరంజీవిని కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి హోదాలో పిలిచారో లేక సినీ ఇండస్ట్రీ పెద్దగా గుర్తించి రమ్మన్నారో కూడా క్లారిటీ లేదు.
ఏదేమైనప్పటికీ రెండు ప్రభుత్వాలూ మెగాస్టార్‌కి తగిన ప్రాధాన్యత ఇచ్చాయి. దానికి నాగబాబు సంతోషించాల్సిందోపోయి ఇలా తప్పుపట్టడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ప్రతి నేతా నటించేవాడే. ఎందుకంటే వాళ్లు ప్రజలకు తమ సొంత డబ్బు ఖర్చుపెట్టరు. ఒకటీ అరా సందర్భాల్లో దానధర్మాలు చేస్తుంటారు తప్ప ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక జనం సొమ్మునే జనం కోసం కేటాయిస్తుంటారు. రేప్పొద్దున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ విజయం సాధించినా ఇదే చేస్తాడు. రాజకీయం అంటేనే అది కదా. ఆ చిన్న పాయింట్‌ను మర్చిపోయి నాగబాబు ఏకంగా ప్రధాని మోడీని, సీఎం జగన్‌ని, మంత్రి రోజాని “బాగా నటించారు” అంటూ వెటకారం చేశాడు.
తద్వారా.. అనవసరంగా చిరంజీవిని పిలిచామా అని ఆయా నేతలు అనుకునేలా నాగబాబు వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సందర్భంగా సైతం నాగబాబు ఇలాగే చిరంజీవి పేరును పదే పదే ప్రస్తావించాడు. ప్రకాష్‌రాజ్‌కు ఓటేయండని మెగాస్టార్ ఎక్కడా ఓపెన్‌గా చెప్పలేదు. కానీ నాగబాబే “ప్రకాష్‌రాజ్ వెనక మా అన్నయ్య ఉన్నాడు. మేమంతా ఉన్నాం” అంటూ ప్రకటనలు చేశాడు. చివరికి ప్రకాష్‌రాజ్ ఓడిపోవటంతో అది ఇన్‌డైరెక్ట్‌గా చిరంజీవి ఓటమి అనే ప్రచారం జరిగింది. దీనికి బాధ్యుడు నాగబాబే. ఇలా ఈయన తన అన్నయ్య ఇమేజ్‌కి తెలిసో తెలియకో చేటు చేస్తున్నాడనిపిస్తోంది.