టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా.. అందరూ కలిసొచ్చినా ఈక కూడా పీకలేరు అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి అడ్డా.. దీనిని ఎవరూ చెక్కు చెదర్చలేరు అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మూడేళ్ల పాలనలో మనం సాధించిన విజయాలను మళ్లీ గడపగడపకు వెళ్లి వివరిస్తున్నామని తెలిపారు.. ఇన్ని పథకాలు అందిస్తున్నామని ధైర్యంగా చెప్పే దమ్ము ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకే ఉందన్నారు. ఇక, మరో 25 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రానికే జగనే సీఎం అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.
ఇక, చంద్రబాబు గుడివాడ పర్యటనపై స్పందిచిన జోగి రమేష్.. చంద్రబాబు.. గుడివాడకు వచ్చి ఏం చెప్తారు? అని నిలదీశారు.. కొడాలి నాని ఓడిస్తానని చెబుతాడా… ఇది జరిగే పనేనా ?? అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్… ఇంకా ఎంత మంది కలిసినా కొడాలి నానిని ఏం చేయలేరు.. అందరూ కలిసొచ్చినా ఈక కూడా పీకలేరు.. నానిని ఓడించే సత్తా మీకు లేదంటూ సవాల్ చేశారు. ఇక, ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టుకుని ఇప్పుడెలా నిమ్మకూరు వస్తావు చంద్రబాబు? అంటూ ఫైర్ అయ్యారు. నిమ్మకూరులో చంద్రబాబు బస చేస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.. దమ్ముంటే సామాజిక న్యాయంపై చర్చకు మేం సిద్ధం… చర్చకు వచ్చే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ చాలెంజ్ చేశారు.. 25 మంది మంత్రుల్లో 17 మంత్రి పదవులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్‌ది అన్నారు.. జగన్ ఓ ధీశాలి, ఓ ధీరుడు అంటూ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు.