రోజురోజుకు క్షీణిస్తున్న తెలుగుదేశం పార్టీని పైకి తేవడానికి ఉపయోగిస్తున్న జాకీలు విరిగిపోతున్నాయి అంటూ జనసేనను ఉద్దేశించి ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర కామెంట్లు చేశారు.. తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, జగన్నాధపురం గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవంలో మంత్రి రోజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి గత మూడు సంవత్సరాలుగా వివిధ ఎన్నికల్లో వైకాపా విజయభేరి మోగించిందన్నారు. వైకాపా ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడు సంవత్సరాల్లోనే దాదాపుగా అమలు చేయగలిగింది అన్నారు. మిగిలిన కొద్దిపాటి ప్రజా సమస్యలను రూపు మాపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. భీమవరంలో చారిత్రాత్మక అల్లూరి సీతారామరాజు కార్యక్రమం సక్సెస్ కావడాన్ని చూసి భీమ్లా నాయక్ కు మతి భ్రమించిందని రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ల కాంబినేషన్ లో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఆర్కే రోజా.