క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టం రాష్ట్రంలో గతంలో మూడవ ర్యాంకులో ఉంటే… దాన్ని నేడు 19వ ర్యాంకుకు దిగజార్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విమర్శలు గుప్పించారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఎప్పుడూ లేని విధంగా 67 శాతానికి దిగజారిందని, విద్యాకానుక టీడీపీ హయాంలో కూడా ఉందన్నారు. గతంలో కూడా విద్యార్థులకు డ్రస్సులు, బూట్లు, బుక్స్, బ్యాగులు, ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చామని, కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో ప్రకటనలివ్వడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ఆయన మండిపడ్డారు. మాతృభాషను వదిలేసి విద్యార్థులను ఇంగ్లీష్ భాషనే చదవమనడం అన్యాయమని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు సంవత్సరానికి 26 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
టీడీపీ ఐదేళ్లలో ఒక లక్షా 31 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ రూ.53 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ, బెస్ట్ అవలబుల్ స్కూళ్లను రద్దు చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ ఎటుపోతోందో తెలియని పరిస్థితి అని, గతంలో విద్యార్థులకు ల్యాప్ ట్యాబులు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ట్యాబులు ఇస్తామంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగనన్న విద్యా కానుక పేరిట కేవలం హంగూ ఆర్భాటం మాత్రమేనని ఆయన విమర్శించారు.