బాలయ్య మంత్రాంగం..! చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ

0
115

మంచు మోహన్‌ బాబు, ఆయన ఫ్యామిలీతో నటసింహ నందమూరి బాలకృష్ణకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ ఫ్యామిలీ కోసం ఓ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసి ఆకట్టుకున్న బాలయ్య.. మా ఎన్నికల్లోనూ వారికి అండగా నిలబడ్డారు.. అన్నగారు ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పుడు బాలయ్య వరకు ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉంది.. అయితే, ఇవాళ జరిగిన ఓ పరిణామం వెనుక.. బాలయ్య కీలకంగా పనిచేసినట్టు టాక్‌ నడుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్‌బాబుకు గ్యాప్‌ ఉంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యేవారు మోహన్‌బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది..

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మోహన్‌బాబు.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం చూస్తుంటే.. కొత్త చర్చ మొదలైంది.. మరోసారి రాజకీయాల్లోకి మోహన్‌బాబు రాబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది… కాగా, టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సినిమా టికెట్ల వివాదం సమయంలో.. అప్పుడు మంత్రిగా ఉన్న పేర్నినాని తన ఇంటికి వెళ్లిన సమయంలో అధికారం అంటే తనకు ఆసక్తిపోయిందని వ్యాఖ్యానించారు మోహన్‌బాబు.. 1995లో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై సేవ చేశాను.. 1998లో బీజేపీకి ఏపీలో మంచి సీట్లు రావడానికి నేనే కారణం.. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశాను.. వారి గెలుపులో నా పాత్ర ఉంది.. నాకు అన్ని పార్టీల్లో పరిచయాలు ఉన్నాయి.. అందరు నేతలు నా ఇంటికి వస్తుంటారు.. పోతుంటారు అని వ్యాఖ్యానించారు.. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబును కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అనే చర్చ మొదలైంది.

ఇక, వైఎస్‌ జగన్‌ సమీప బంధువు అని చెప్పుకునే మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసినా.. ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు.. ఇక, సినిమా టికెట్ల వివాదం విషయంలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ లాంటి వారిని పిలిచి తనను పిలవక పోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.. మా ఎన్నికల్లో తమ కుమారుడు విజయం సాధించినా.. సినీ పరిశ్రమలో తాము ఒంటరిగా మిగిలిపోయామనే ఆవేదనతో ఆయన ఉన్నారని టాక్‌.. అయితే, చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీకి హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్యవర్తిత్వం నడిపినట్టు చర్చ సాగుతోంది.. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌కు సపోర్ట్‌ చేస్తే.. బాలయ్య అండ్‌ గ్యాంగ్‌ మాత్రం విష్ణుకు అండగా నిలిచింది.. ఆ ఎన్నికల్లో బాలయ్య టీమ్‌ కృషి వల్లే విష్ణు విజయం సాధించారని చెబుతుంటారు.. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మన మధ్య గ్యాప్‌ ఎందుకు? అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేద్దాం.. చంద్రబాబును మీరు కలవడం అని బాలయ్య సూచించడంతో.. ఇవాళ్టి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ, మోహన్‌బాబు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సందర్భాలు లేవు.. ఇదే సమయంలో.. తనకంటూ ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలన్న ఉద్దేశంతోనే మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారనే చర్చ సాగుతోంది. మరి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. ఇక, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here