బెజవాడలో టీడీపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పర్యటన సందర్భంగా కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా దేవినేని ఉమపై కేశినేని నాని సెటైర్లు వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఎంపీ కేశినేని నాని, జలీల్ ఖాన్ పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్న, నాగుల్ మీరా దూరంగా ఉన్నారు. అయితే.. టీడీపీ ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. అందరినీ భాగస్వామ్యం చేసి టీం టీడీపీ పేరుతో కార్యక్రమాలు చేస్తామన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. కమర్షియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదని, ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నేతలు కాలేరన్నారు. మీడియా నుంచి కాదు.. ప్రజల్లో నుంచే నాయకులు బయటకి వస్తారని, చంద్రబాబు సీఎం కావాలనే సంకల్పంతో కలిసి మెలిసి పని చేయాలన్నారు. నాకు నేనే గొప్ప అని వెళితే ప్రజల్లో పరాభవం తప్పదని, అందరూ ఎవరి స్థాయిలో వారు పని పంచుకుని ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు.
గతేడాది నుంచి ఇక్కడ ప్రజాస్వామ్యబద్దంగా టీడీపీ పని చేస్తుందని, ఎవరు పదవులు పొందినా ఐక్యంగా నిర్ణయం జరిగిందన్నారు. జగన్ పాలనలో ప్రజలు పాట్లు పడుతున్నారని, యధా రాజా తధా ప్రజ అన్నట్లుగా వైసీపీ నేతలు ఉన్నారన్నారు. వారు ఎన్ని మాయలు చేసినా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జగన్ మాయ మాటలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల,మతాలకతీతం. పార్టీ నే కాదు… వ్యక్తిని చూసి ఓటేస్తారు. 2019ఎన్నికల్లో ఎంపిగా నాకు మెజారిటీ ఇచ్చారు.. ఎమ్మెల్యేని ఓడించారు. తానొచ్చాకే బెజవాడకు కృష్ణానది, దుర్గ గుడి, భవానీ ద్వీపం వచ్చినట్టు జగన్ మాట్లాడుతున్నారు. తాను లేకపోతే విజయవాడే లేదన్నట్లుగా జగన్ గొప్పలు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే మూడు ఫ్లైఓవర్లు వచ్చాయి. రాష్ట్రం మధ్యన ఉన్న అమరావతి రాజధాని ఉంటేనే అందరికీ ఉపయోగం. విశాఖ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. విశాఖ రైల్వే జోన్ రాకపోయినా జగనులో చలనం లేదు. జగన్ కేంద్రం మెడలు వంచడం కాదు.. మోడీ కాళ్ల మీద పడుతున్నాడు. ఇళ్లల్లో ఆడవాళ్లను అన్యాయంగా లాగుతున్నారు, దూషిస్తున్నారు. మీ ఇళ్లల్లో భార్య, తల్లి, పిల్లల్లేరా..? సంస్కార హీనులుగా మారకండి. ఆడవాళ్లను తిట్టే అన్ని పార్టీ నాయకులకు చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.