ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న విషయం తల్లిదండ్రులకు సైతం తెలియదు. ఎంతో అన్యోన్యంగా వుంటాడని భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు. పెళ్లి చేసుకున్న మూడు రోజులకే ఏమైందో ఏమో ప్రాణం తీసుకోవాలని కత్తితో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉల్లికల్లుకు చెందిన 19 ఏళ్ల మహేంద్ర ఆటో నడుపుతూ జీవించేవాడు. ఇంతలోనే ప్రేమలో పడ్డాడు. ఎవరికి తెలియకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూడు రోజులకే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
గొంతు కోసుకున్నాడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పరుగు పరుగున కళ్యాణదుర్గం ఆస్పత్రికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అనంతపురం ఆస్పత్రికి తీసుకొచ్చారు. తమ అబ్బాయి ప్రేమించిన విషయం కాని, పెళ్లి చేసుకున్న విషయం కాని, ఆ అమ్మాయి ఎవరన్న విషయం తమకు తెలియదని మహేంద్ర తండ్రి మల్లికార్జున స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.