ఉల్లి రైతులకు కన్నీళ్లు.. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు

0
901

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర పతనమైంది. ఎప్పటిలాగే రైతు పండించిన పంట మార్కెట్ కు రాగానే ధర పడిపోయింది. ధర లేకపోవడంతో పంటకోసి మార్కెట్ లో అమ్మితే వచ్చే నష్టం భరించడంనకంటే పంట దున్నేస్తే తక్కువ నష్టం వస్తుంది. కొందరు రైతులు పండించిన పంటనే దున్నేస్తున్నారు. మరికొందరు ఎంతో కొంత వస్తుందన్న ఆశతో మార్కెట్ కు తీసుకువెళ్లి నష్టపోతున్నారు. ఉల్లి ధర పతనం రైతుల్ని ఇబ్బందిపెడుతోంది.

ఉల్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని 4లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేసాడు. పండిన ఉల్లిన కోసి, గ్రేడింగ్ చేసి, ట్రాక్టర్ లో మార్కెట్ కు తరలిస్తే కూలీలు, రవాణా ఖర్చు కనీసం 3 లక్షలు వ్యయం అవుతుంది. మార్కెట్ లో సరుకు అమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదు. దీంతో ఉల్లి పంటను 12 వేలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ తో దున్నించాడు. కూలీలు, ఎరువులు, కౌలు మొత్తం ఖర్చులు అప్పు చేసి ఉల్లి సాగు చేస్తే పెట్టుబడి మొత్తం కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. ఉల్లి ధర పడిపోయింది. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో 20 నుంచి 30 రూపాయలు ఉంది. అయితే రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అంటే రైతు వద్ద కిలో 4 నుంచి 8 రూపాయాలు కొంటున్నారు. ఉల్లి గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు 75 వేలకు పైగానే ఉందని, ఇప్పటి ధర పెట్టుబడికి కూడా రావడం లేదంటున్నారు రైతులు. దళారులు ఉల్లి ధర రైతులకు దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతుంది. ఇతర రాష్ట్రాలకు కర్నూలు జిల్లా నుంచి ఉల్లి ఎగుమతి అవుతుంది. రైతులకు ఎప్పుడో ఒకసారి కానీ మంచి ధర దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధర పడిపోతుందేమోనన్న భయం రైతుల్లో ఉంది. ఇప్పటికే కర్నూలు మార్కెట్ కు 1300 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ట ధర 415 కాగా గరిష్ట ధర 1150 వుంది. గరిష్ట ధర దక్కేది ఏ ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతుంది. మెజారిటీ రైతులకు దక్కేది 500 నుంచి 800 రూపాయల లోపే. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి ఏటా రైతులు కోరుతూనే వున్నారు. రైతులు నష్టపోతూనే వున్నారు. ఇప్పటికైనా ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here