ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుండి ప్రజలు తమ సోషల్ మీడియా అక్కౌంట్ లోని డీపీగా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. అలానే ఈ నెల 13వ తేదీ నుండి 15 వరకూ ప్రతి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురవేయమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
75వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశభక్తి పూరితంగా జరపడం కోసం కేంద్రం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అలానే ఘర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఓ ప్రత్యేక గీతాన్ని సైతం బుధవారం విడుదల చేసింది. ఇందులో సినీ ప్రముఖులతో పాటు క్రీడాకారులూ, సంగీత, నృత్యకారులు కూడా పాల్గొన్నారు. అమితాబ్ తో మొదలైన ఈ పాటలో బాలీవుడ్ కు చెందిన అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, అనుపమ్ ఖేర్, అనుష్క శర్మ తదితరులు కనిపించారు. ఇక దక్షిణాదికి వస్తే ఇక్కడ కథానాయకుల్లో కేవలం ప్రభాస్ కు మాత్రమే చోటు దక్కడం విశేషం.
అలానే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సైతం ఇందులో కనిపించారు. ఆయనపై గేట్ వే ఆఫ్ ఇండియా నేపథ్యంలో షాట్స్ తీశారు. అలానే దక్షిణాది కథానాయిక కీర్తి సురేశ్ కూడా ఈ పాటలో మెరిశారు. క్రీడా రంగానికి చెందిన విరాట్ కొహ్లీ, మీరాబాయ్ చాను, మిథాలీ రాజ్, మేరీ కోమ్, పీటీ ఉష తదితరులు ఈ పాట చిత్రీకరణలో పాలు పంచుకున్నారు. సోనూనిగమ్ తో పాటు ఆశాభోంస్లే ఈ పాటను గానం చేస్తూ కనిపించారు. ఈ పాట సోషల్ మీడియాలో విడుదల చేసిన దగ్గర నుండి వైరల్ గా మారిపోయింది.