ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇవాళ రాత్రి జాతీయ రహదారులపై, స్థానిక రోడ్లపై నూతన సంవత్సర వేడుకలు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. ప్రజా రహదారులు,అన్ని ప్రమాదాలకు గురయ్యే సున్నిత ప్రాంతాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఫైర్ క్రాకర్స్ కాల్చడాన్ని ఖచ్చితంగా నిషేధించారు. మద్యం మత్తులో , సైలెన్సర్లు లేకుండా వాహనాలు నడపరాదు. అలాంటి రైడర్స్ పై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టావు.
మద్యం త్రాగి వాహనాలను నడిపే వారిని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. మద్యం త్రాగి వాహనాలను నడిపిన డ్రైవర్లను కోర్టులో హాజరుపరచడం ద్వారా మెజిస్ట్రేట్ వారు భారీగా ఫైన్ విధించే అవకాశం వుందని జిల్లా పోలీసులు తెలిపారు. బార్లను నిర్ణీత సమయంలో మూసివేయాలని, డీజేలు నిషేధించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. రోడ్లపై యువత మద్యం బాటిళ్లు బీర్లు త్రాగుతూ వీధుల్లో నడుస్తూ బైక్స్ పై తిరుగుతూ ఆడవాళ్లపై బాలికలపై టీజింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఇటు తిరుపతిలో ఆంక్షలు అమలవుతున్నాయి. తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. యువత రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం నుండి తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ మూసివేయనున్నారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సూచించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో బ్రీత్ అనలైజెర్ టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మందు తాగి పట్టుబడితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
కాలేజ్ యాజమాన్యాలకు మందు తాగిన విద్యార్థుల లిస్ట్ పంపుతాం అన్నారు. బైక్ , కార్ రేసింగ్ లకు పాల్పడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ. ప్రభుత్వ నిబంధనల మేరకు వైన్ షాప్స్, బార్ లు మూసివేయాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశించారు. బైక్ లపై విచ్చలవిడిగా తిరిగితే కఠినచర్యలు వుంటాయన్నారు. విజయవాడ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది పోలీస్ శాఖ. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షల గురించి నగర సీపీ కాంతిరానా టాటా ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి చేయడం లాంటి చర్యలు కుదరవని హెచ్చరించారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించాలన్నారు