మూడు రాజధానుల వస్తే మీకొచ్చే ఇబ్బంది ఏంటి?.. చంద్రబాబుపై తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు

0
145

ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత మేనిఫెస్టో అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి హామీ మతగ్రంథంగా పవిత్రంగా భావించాల్సిన‌ అవసరం ఉందన్నారు. ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు పవిత్రమైనవిగా భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ 98.44 శాతం ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అంకితభావం, నిబద్ధతకు ప్రతిరూపం జగన్ అని ప్రశంసలు గుప్పించారు. గతంలో చంద్రబాబు 612 హామీలు ఇచ్చి.. ఆన్‌లైన్‌లో పెట్టి.. జనాలు ప్రశ్నిస్తున్నారని ఆన్ లైన్ నుంచే తొలగించారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పి్న వాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు.. చరిత్ర కారుడా ..? చరిత్ర హీనుడా..? అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు.

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా అక్టోబర్‌ 1 నుంచి వైకాపా సర్కారు ప్రారంభించనుందని ఈ సందర్భంగా వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలబడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల వివాహాలకు లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు లక్షా ఇరవై వేలు ఇవ్వనున్నారని తెలిపారు. మేనిఫెస్టోకి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. గతంలో అలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరని, ఇక ఆయనకు ఆయనే పోటీ అన్నారు.

ఉత్తరాంధ్రలో జరిగేది పాదయాత్రనా లేదా దండయాత్రనా.. లేక అసమర్దుని అంతిమయాత్రనా అంటూ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. గతంలో కేవలం హైదరాబాద్‌ అని ఆదాయాన్ని అక్కడ డంప్ చేశారని.. నాడు రాయలసీమ , ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే దగ్గర అభివృద్ధి కేంద్రీకృతం కావడంతో తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ర్టం అర్దికంగా , పారిశ్రామికంగా వెనకకు నెట్టివేయబడిందన్నారు. ఏపీలో మరోసారి వేర్పాటువాదులతో పోరాడే అవకాశం లేదన్నారు.

ఏపీలో మూడు రాజధానుల వెనుక దూర దృష్టి ఉందన్న ఆయన.. రాష్ర్ట ప్రజలకు సమగ్ర అభివృద్ది , సంక్షేమం అందాలనేదే మూడు రాజధానుల ముఖ్య ఉద్దేశమన్నారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులంటే చంద్రబాబుకు ఏంటి సమస్య అని ప్రశ్నించారు. చంద్రబాబు సమస్య అంతా ఒకే సామాజిక వర్గానికి భూములు కట్టబెట్టడమేనని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చెప్పే యాత్ర గురించి ఇక్కడి ప్రజలు అడగాలన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర , రాయలసీమ తల్లడిల్లిపొతుంటే మా ఉసురు పోసుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలం మేం బ్రతకాలా వద్దా ..బాబు? అంటూ ప్రశ్నించారు.

అమరావతిలో రాజధాని పెట్టి ఘోర నేరం చేశారని.. చంద్రబాబు ఓ క్రిమినల్ అంటూ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే ఈ యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇదంటూ మండిపడ్డారు. బాబు ఇప్పుడు అంపశయ్య మీద ఉన్నాడని అన్నారు. అమరావతి టు అరసవల్లి యాత్ర అడ్డుకొని తీరుతారని ఆయన చెప్పారు. అశాంతికి బాబే కారణం అవుతారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here