వరదల నుంచి ఇంకా కోలుకోని ప్రాంతాలు అనేకం వున్నాయి. అయితే నిత్యం కరువుతో బాధపడే అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు వర్షాల కోసం పూజలు చేయడం విశేషం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో వానలు కురవాలి, మా చెరువులు నిండాలంటూ పూజలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. వేకువ జామునే కప్పలను కుండలో నెత్తిన పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి జలాభిషేకం చేశారు.
అనంతరం గ్రామంలోని కాటమయ్య స్వామి దేవస్థానం వద్దకు మహిళలు, గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు.అనంతరం వానలు కురవాలంటూ గ్రామస్తులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఇలా పూజలు చేస్తే వర్షాలు వస్తాయని నమ్మకం వుందంటున్నారు గ్రామస్తులు. వర్షాలు రాక పొలాల్లో వేసిన వేరుశెనగ,కంది ఇతర పంటలు అన్నీ ఎండిపోతున్నాయన్నారు .అందుకనే మా గ్రామంలో ఇలా కప్పలమ్మ అనే అమ్మవారికి పూజలు చేస్తే వర్షాలు వస్తాయనే నమ్మకంతో గ్రామస్తులు
ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో అనేక ప్రాంతాల్లో వరుణ జపాలు, శివుడికి అభిషేకాలు నిర్వహించారు. గతంలో తెలంగాణలో వానల కోసం నూటొక్క కాడెద్దులతో… వెయ్యిపదహారు బిందెలతో.. కృష్ణానది నీటిని తెచ్చి ఆంజనేయస్వామికి అభిషేకం చేశారు. గద్వాల జిల్లాలో ఈ తరహా పూజలు జరిగాయి. కృష్ణానది దగ్గరకు చేరుకుని 1016 బిందెలలో కృష్ణా నీళ్లను తెచ్చి స్థానిక ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. కృష్ణమ్మ ఒడ్డున చేరి వానలకోసం ప్రార్ధిస్తామని, వర్షం కురిస్తే మళ్లీ కృష్ణమ్మకు నదీ హారతి ఇచ్చి, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.