శ్రీశైలంలో నూతన సేవలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆలయంలో ఉదయాస్తమానసేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఈవో లవన్న. సెప్టెంబర్ 5 నుంచి భక్తులకు ఈ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ద్వాదశ మహాక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం భక్తుల సౌకర్యార్ధం నూతనంగా ఉదయాస్తమానసేవ, ప్రదోమాలసేవలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ట్రస్టుబోర్డు అనుమతి ఆదేశాలతో ఆలయ ఈవో లవన్న లాంచనంగా ప్రారంభించారు పరిపాలనా భవనంలో ఈ నూతన సేవలను ఆలయ అర్చకులు, వేదపండితులచే ఈ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
ఉదయాస్తమానసేవలో పాల్గొనే భక్తులకు ఆలయం ద్వారాలు తెరిచినది మొదలు తిరిగి ఆలయ ద్వారాలు మూసేంత వరకు శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహించే 14 సేవలలో పాల్గొనే విధంగా దేవస్థానం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా వేకువజామున గోపూజతో ప్రారంభమై రాత్రి ఏకాంతసేవతో ఈ ఉదయాస్తమానసేవ ముగిస్తుందని ఈవో తెలిపారు. అలాగే ప్రదోషకాల సేవలో పాల్గొనే భక్తులకు సాయంత్రం ఆలయంలో నిర్వహించే మహామంగళహారతి, స్వామివారి గర్భాలయంలో పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వేదాశీర్వచనం కల్పిస్తున్నారు. అయితే భక్తులు ఈ సేవలలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevastanam.org లేదా www.aptemples.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చును. కాగా రోజుకు ఈ సేవలకు 6 టికెట్లు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు ఈవో తెలిపారు. ఉదయాస్తమానసేవకు రూ.1.01.116 లు. ప్రదోషకాల సేవకు రూ.25,116లు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అయితే సేవలలో పాల్గొనే భక్తులకు దేవస్థానంచే స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను బహుకరిస్తూ వీటితో పాటు వసతి, అల్పాహారం, భోజనఏర్పాట్లను కల్పించనున్నారు.