పోలవరం విలీన మండలాల పర్యటనకు బయలు దేరారు చంద్రబాబు. ఇవాళ, రేపు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
ఏపీలో భారీవర్షాలు, గోదావరి వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే ఒకమారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు చంద్రబాబు పర్యటించనున్నారు.
ఇవాళ ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివ కాశీపురం, కుక్కునూరులలో బాబు పర్యటన వుంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు చంద్రబాబునాయుడు. రాత్రికి భద్రాచలంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం భద్రాద్రి రాముడిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన రెండో రోజు పర్యటన మొదలు అవుతుంది. శుక్రవారం పర్యటనలో భాగంగా ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
.