ఏపీ రాజకీయాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తూనే వుంది. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయ్యన్నపాత్రుడు.
అయ్యన్న పిటిషన్ ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. చోడవరంలో మహానాడు తర్వాత ప్రభుత్వం తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తోందని అయ్యన్న పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఇంటి గోడను అక్రమంగా కూల్చేశారని పిటిషనులో పేర్కొన్నారు.
తన వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగించేలా తప్పుడు కేసులు పెడుతున్నారని పిటిషనులో వెల్లడించారు. తనపై ఏమైనా కేసులు నమోదయ్యాయా అనే అంశంపై జిల్లాల ఎస్పీలను కోరినా కొందరు సమాచారం ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు అయ్యన్న. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆన్ లైనులో ఎఫ్ఐఆర్లు ఉంచాల్సి ఉన్నా.. అందుబాటులో ఉంచడం లేదన్నారు అయ్యన్న. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది హైకోర్టు. ఎఫ్ఐఆర్ ల సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ అడ్వకేటుని ప్రశ్నించింది హైకోర్టు. కొంత సమయం కావాలని ప్రభుత్వ అడ్వకేట్ కోర్టుని కోరారు. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్ట్.