శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరదతో నిండుకుండలా మారింది. వరద ప్రవాహం పెరగడంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో : 1,51,058 క్యూసెక్కులుగా వుంది.
అలాగే, ఔట్ ఫ్లో : 1,47,254 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా వుంది. జలాశయంలో ప్రస్తుతం 885 అడుగుల నీరు వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం : 215.8070 టీఎంసీలుగా వుంది.
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుల చేస్తుండటంతో శ్రీశైలానికి భారీగా ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం నిండుకుండలా మారడంతో పర్యాటకులు కూడా భారీగా తరలివస్తున్నారు.
అటు శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులు శ్రీశైలం జలాశయం చూడడానికి వస్తున్నారు. ఎడతెగని వర్షాల కారణంగా వారికి కాసింత అసౌకర్యం కలుగుతోంది. నదిలో నీరు ఎక్కువగా వుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.
ఇటు తుంగభద్ర డ్యాం కూడా వరద నీటితో కళకళలాడుతోంది.