ప్రాజెక్టులకు నీటి గండం.. గట్టెక్కేదెప్పుడు?

0
223

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరే వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్ట్ ల నుంచి గ్రామాలు, పట్టణాలకు తాగు, సాగు నీరు అందే పరిస్థితి నుంచి అందుకు విరుద్ధంగా ఉత్తర తెలంగాణలోని ప్రతీ నేలా వరద పరవల్లతో పొంగుతుండడంతో పాటు ఎగువ నుంచి గోదావరికి వస్తున్న వరద తోడు కావడంతో ఊళ్లు, భూములు, దేవాలయాలు, ప్రాజెక్ట్ లు సర్వం నీటిలో తేలాడుతున్నాయి.

1986 లో మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాంతంలో రికార్డు అయిన (సిడబ్లూసి గేజింగ్) భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ర్ట, ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరద నీటికి మొత్తం ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయిపోయింది. 14 వ తేది మధ్యాహ్నం నాటికి మేడిగడ్డ వద్ద వరద ప్రవాహాం 25 లక్షల క్యుసెక్కులు దాటింది. బ్యారేజ్ గరిష్ట ఎత్తు 108 మీటర్లు కాగా ఎఫ్ ఆర్ ఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) వందల అడుగులుగా నిర్మించారు. అయితే ప్రస్తుతం 102 మీటర్ల మేర నీరు ప్రవహిస్తుండడంతో స్పిల్ వే పిల్లర్లు సైతం మునగిపోయాయి. దీనికి తోడు ప్రాణహిత, పెన్ గంగ, వార్ధ లాంటి ఉపనదుల నుంచి భారీగా వరద వస్తోంది.

సాధారణంగా ప్రాణహిత నుంచి మాత్రమే వరద వస్తుంది. ఎప్పుడో కానీ వార్ధ, పెనుగంగల నుంచి వరద రాదు. కానీ గోదావరికి సంబంధించిన అన్ని ఉపనదుల నుంచి వరద వస్తుండడంతో మహారాష్ర్ట, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ప్రాంతాల్లోని పట్టణాలు, పల్లెలు వరదమయం అయ్యాయి. దీని ప్రభావంతో కాళేశ్వరం దేవాలయంలోకి నీరు ప్రవేశించింది. ప్రాజెక్ట్ భద్రత కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నీటిలో మునగిపోయాయి. ఓ వైపు వరద నీటితో నీటి మట్టం పెరగడంతో పాటు ఇంకో వైపు మిడ్ మానేరు, శ్రీరాం సాగర్, కడెం నారాయణరెడ్డి, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి తదితర ప్రాజెక్ట్ ల నుంచి వరద నీరు విడుదలవుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఊరువాడ-గొడ్డు- గోదాం, ప్రాజెక్ట్ లు- పాఠశాలలు, దేవాలయాలు- ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ నీట మునిగిపోయాయి.

గురువారం మధ్యాహ్నం నాటికి గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్ట్ లు వరద నీటితో కొట్టుకుపోయేలా వణికిపోతున్నాయి. శ్రీరాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, కడెం ప్రాజెక్ట్, ఎల్లంపల్లి బ్యారేజ్ మొదలైన ప్రాజెక్ట్ ల నుంచి పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తున్నా అంతే స్థాయిలో వరద వస్తోంది. ఎల్లంపల్లి నుంచి 11 లక్షల 79 వేల క్యూసెక్కుల ఇన్ ఫో సరాసరిన వస్తుంటే 11 లక్షల 85 వేల క్యుసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గురించి ఆందోళన తగ్గింది. వరద తగ్గడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

శ్రీ రాం సాగర్ నుంచి 3 లక్షల 29 వేల క్యుస్కెల నీటిని విడుదల చేస్తున్నారు. కేంద్ర జల సంఘం హెచ్చరికల ప్రకారం ఎప్పుడూ వరద రాని వార్ధ ఉప నదికి గరిష్టస్థాయిలో వరద నీరు వస్తోంది. 162 మీటర్ల గరిష్ట ప్రమాద నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. దీనివల్ల మహారాష్ర్టలోని చంద్రాపూర్ జిల్లాలో వరద విలయ తాండవం చేస్తోంది. అలాగే పెన్ గంగ లో వరద నీరు 97 మీటర్లు గరిష్టం కాగా 103 మీటర్లు దాటి పోయింది. దీని వల్ల యావత్మాల్ జిల్లాలో ముంపునకు గురవుతోంది. అదే విధంగా అదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో గరిష్ట స్థాయిలో వరద నీరు ప్రవాహం 138 మీటర్లు కాగా ఆ స్థాయి ని మంచి ప్రవహిస్తోంది. ఈ విధమైన పరిస్థితి వల్ల ప్రాజెక్ట్ లు నీటి మునిగిపోయి అతలాకుతలం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here