ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో ఇవాళ ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయం ప్రకటించారు. తద్వారా రాజకీయంగా క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని కుమారుడి పార్టీ వైఎస్సార్సీపీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తేల్చిచెప్పారు. తెలంగాణలోని కూతురు పార్టీ వైఎస్సార్టీపీకి మద్దతుగా నిలవనున్నట్లు చెప్పారు. దీంతో వైఎస్ విజయమ్మ నిర్ణయం కరెక్టా కాదా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఒక విధంగా చూస్తే ఇది కరెక్టేనని చెప్పొచ్చు.
ఒక వ్యక్తి రెండు రాజకీయ పార్టీలకు గౌరవ అధ్యక్షురాలిగా ఉండటం టెక్నికల్‌గా కరెక్టో కాదో గానీ నైతికంగా మాత్రం సరికాదు. ఎందుకంటే రాష్ట్రాలు, పార్టీలు వేరు కాబట్టి వాటి విధానాలూ వేరుగానే ఉంటాయి. అందువల్ల విమర్శలు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. కాబట్టి ఎటో ఒక వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి వైఎస్ విజయమ్మది. మామూలుగా అయితే ఒక తల్లికి కొడుకు, కూతురు ఉన్నప్పుడు కుటుంబపరంగా తల్లి కొడుకు వద్దే ఉంటుంది. మనది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాజకీయానికి వచ్చేసరికి ఇదే ఫాలో కావాలని రూలేమీలేదు.
నిజానికి వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఏపీలో కూడా క్రియాశీలక రాజకీయాల్లో లేరు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయినప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. 2019లో కుమారుడి పార్టీ అధికారంలోకి రావటంతో భర్త వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు నెరవేరతాయనే ఆత్మసంతృప్తి ఆమె పొందారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుండగా తెలుగు ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారు. కాబట్టి ఆయన కుటుంబం ఇక తెలంగాణపైనా దృష్టిపెట్టాలనుకుంది. జగన్ ప్రారంభించిన వైఎస్సార్సీపీ మొదట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా 2014 ఎన్నికల తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది.
దీంతో తెలంగాణలో లోటు ఏర్పడింది. పొలిటికల్‌గా ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో రాణించటం కష్టం. అందుకే అంతటి తెలుగుదేశం పార్టీ సైతం ఇప్పుడు ఏపీ పైనే ఫోకస్ పెట్టింది. అయితే తండ్రి ఆశయ సాధన కోసం పోరాడాలని వైఎస్ షర్మిల నడుం బిగించారు. కానీ “ఎలా” అనే ప్రశ్న ఆ సమయంలో తలెత్తింది. తండ్రి పేరిటే ఉన్న వైఎస్సార్సీపీకి కొత్తగా తెలంగాణ శాఖను తెర మీదికి తెస్తారనే ప్రచారం జరిగింది. అయితే దానికి అధ్యక్ష హోదాలో సీఎం వైఎస్ జగన్ ఒప్పుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది.
కొత్త పార్టీకి తండ్రి పేరుతోపాటు అప్పటికే ప్రజాదరణ పొందిన వైఎస్సార్సీపీ పేరు ధ్వనించేలా వైఎస్సార్టీపీ అనే పేరు పెట్టారు. గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ ఏడాది కాలంగా కొనసాగుతున్నారు. అయితే మీడియాలో, జనంలో అనవసర ప్రచారాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదనే సదుద్దేశంతోనే వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఇది కొంత వరకు ముందే ఊహించిందే అయినా వైఎస్ విజయమ్మ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకోవటం ఆశ్చర్యం కలిగించింది.
అంటే ఆమె ఇక పొలిటికల్‌గా వంద శాతం కూతురి పార్టీకే సపోర్ట్ చేయనున్నారని దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఏడాది కాలంగా వైఎస్ విజయమ్మ ఇదే పనిలో ఉన్నారు. కాకపోతే అవసరమైనప్పుడు కుమారుడి(పార్టీ)కి కూడా అండగా ఉంటానని మాటిచ్చారు. వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పాల్సిన రోజు వస్తుందని ఊహించలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. అలాగే ఆమె అవసరం కూడా ఆ పార్టీకి వస్తుందని ఇప్పుడెవరూ ఊహించలేకపోతున్నారు.