ఇండియాలో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం డిమాండ్..

0
80

ఇండియాలో బంగారం డిమాండ్ పడిపోయింది. 6 ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్ చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్ లో వెల్లడించింది. విలువ పరంగా చూస్తే 2023 మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 9 శాతానికి తగ్గి రూ. 56,220 కోట్లకు చేరుకుంది. ఇదే 2022 తొలి త్రైమాసికం(క్యూ1)లో బంగారం డిమాండ్ రూ. 61,540 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రధానంగా యూఎస్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ ధరలు పెరగడం, రూపాయి విలువ పతనం కావడం బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి.

అధిక ధరల నేపథ్యంలో 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో 135 టన్నులతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి 17 శాతం తగ్గి 112 టన్నులకు పడిపోయింది. 2016లో బంగారం డిమాండ్ 107 టన్నులుగా ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 44 టన్నులకు పడిపోయింది. 2020లో కోవిడ్ సమయంలో మినహా ఎప్పుడూ బంగారం డిమాండ్ పడిపోనిది.. ఈ ఏడాది క్యూ1లో బంగారం డిమాండ్ తగ్గింది. విలువ పరంగా, జనవరి-మార్చి 2023లో బంగారం పెట్టుబడి డిమాండ్ రూ. 17,200 కోట్లు, క్యూ1 2022లో రూ. 18,750 కోట్లతో పోలిస్తే 8 శాతం తగ్గింది.

అభరణాల డిమాండ్ కూడా 17 శాతం తగ్గి 78 టన్నులకు చేరుకుంది. ఇది ఆరేళ్ల కనిష్టం. విలువ పరంగా చూస్తే రూ. 428 కోట్ల నుంచి రూ. 390 కోట్లకు చేరింది. పెట్టుబడి డిమాండ్ కూడా 41 టన్నుల నుంచి 34 టన్నులకు చేరింది. 2023 క్యూ 1లో ఇండియాలో రీసైకిల్ చేయబడిన మొత్తం బంగారం 34.8 టన్నులు, 2022లో ఇది 27.8 టన్నులు అంటే దాదాపుగా 25 శాతం పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here