దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అదుపు లేకుండా పోతోంది. రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్‌లో ఆల్ టైం కనిష్టాన్ని తాకింది 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు భారత దేశ రూపాయి విలువ క్షీణించడం కొనసాగుతుండటం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కరోనా మహమ్మారి, అంతకుముందు ఆర్థిక మందగమనం, ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దృష్ట్యా రూపాయి విలువ రోజురోజుకు ఆల్‌టైం రికార్డుల దిశగా పతనమవుతోంది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. గురువారం ఏడు పైసలు రికవరీ కావడానికి ముందు దీని విలువ రికార్డు స్థాయిలో పతనమై 79.81కి చేరింది. బలమైన అమెరికన్ కరెన్సీ ఓవర్‌ఫ్లోస్, ఫారెక్స్ ఔట్‌ఫ్లోస్ రూపాయి లాభపడకుండా అడ్డుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గురువారం మార్కెట్ ముగిసే సమయానికి ఓ అమెరికన్ డాలర్‌కు రూ.79.90 స్థాయికి రూపాయి విలువ పతనమైంది. అంటే ఓ డాలర్‌కు రూ.80 స్థాయికి దగ్గర్లో ఉంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల ప్రజలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ పతనం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫిబ్రవరి నుంచి దాదాపు 26 సార్లు పతనమైంది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి ఐదుసార్లు కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. 2022 ప్రారంభంలో డాలరకు 74 వద్ద ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి 6.4 శాతం నష్టపోయి 80 స్థాయికి చేరేందుకు అతి సమీపంలో ఉంది. మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది కాబట్టి ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళ వల్ల రూపాయి పతనం తాలూకు సెగ తప్పకుండా తగులుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. దీనికితోడు ప్రపంచమాంద్య భయాలు, యూరప్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు లాంటివి రూపాయిని దెబ్బ తీస్తున్నాయి. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది.