తారాగణం:
నటీనటులు: రామ్ చరణ్, ఆది పినిశెట్టి, సమంత, ప్రకాష్ రాజ్, జగపతి బాబు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్ వర్క్: రామకృష్ణ, మౌనిక
సాహిత్యం: చంద్రబోస్
బ్యానర్: మైత్రిమూవీ మేకర్స్
దర్శకత్వం: సుకుమార్
మాస్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఇంటెలెక్చువల్ స్టోరీస్‌తో ప్రేక్షకుడి మెదళ్లకు పనిచెప్పే సుకుమార్ ఇద్దరు తమ తమ రెగ్యులర్ ఫార్మాట్లకు భిన్నంగా పీరియాడికల్ స్టోరీని ఎంచుకుని చేసిన సినిమా రంగస్థలం. 1985 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించాడు సుకుమార్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మరి చరణ్ నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కాడా..? సుకుమార్ ట్రై చేసిన కొత్త జానర్ అతనికి మంచి రిజల్ట్‌ని ఇచ్చిందా..? తెలుసుకోవాలంటే కథలోకి ఎంటరవ్వాల్సిందే.
కథ:
ఫణీంద్ర భూపతి(జగపతిబాబు) రంగస్థలం ప్రాంతానికి ప్రెసిడెంట్. ముప్పై ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ తన పరపతి, పలుకుబడితో ఆ ప్రాంతాన్ని ఏలుతుంటాడు. అతడు ఎన్ని అన్యాయాలు చేసిన అక్కడి ప్రజలు ఎదిరించలేరు. ఎదిరించినా అతడి ముందు నిలవలేరు. అదే గ్రామంలో చిట్టిబాబు(రామ్ చరణ్) తన కుటుంబంతో జీవిస్తుంటాడు. చిట్టిబాబుకి వినికిడి లోపం ఉంటుంది. అది లోపంగా భావించకుండా అందరితో కలిసిమెలసి సరదాగా ఉంటుంటాడు. ఓరోజు రామలక్ష్మి(సమంత) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు చిట్టిబాబు. ఆమె కూడా చిట్టిబాబుని ప్రేమిస్తుంది. చిట్టిబాబుకి కుమార్ బాబు(ఆది పినిశెట్టి) అనే అన్నయ్య ఉంటాడు. దుబాయిలో ఉద్యోగం చేసే కుమార్ బాబు ఊరికి వచ్చి అక్కడున్న పరిస్థితులను గమనిస్తాడు. ప్రెసిడెంట్ ఊర్లో వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకొని అతడికి పోటీగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమవుతాడు. తనకి అడ్డం వచ్చే ప్రతి ఒక్కరినీ చంపించే ఫణీంద్రభూపతి కుమార్ బాబుని ఏం చేశాడు..? తన అన్నయ్యను చిట్టిబాబు కాపాడుకున్నాడా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది.
కళాకారుల పనితీరు:
చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ జీవించేశాడనే చెప్పాలి. గుబురు గడ్డం, లుంగీ కట్టుతో పల్లెటూరి కుర్రాడిగా అతడు నటించిన తీరుని మెచ్చుకోవాల్సిందే. తన చెవిటితో కామెడీ పండించాడు. వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఎలా స్పందిస్తుంటారో అదే విధంగా స్పందిస్తూ తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో తెరపై ఆవిష్కరించాడు. అన్నయ్యను కాపాడుకోవడం కోసం పరితపించే సన్నివేశాలలో ఎమోషన్స్ ను బాగా పండించాడు. చాలా కాలం వరకు చరణ్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు. అంతగా ఇంపాక్ట్ చేశాడు. సమంత తన నటనతో మెప్పించింది. పల్లెటూరి అమ్మాయిగా ఆమె కట్టు బొట్టు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఆది పినిశెట్టి పాత్ర మరో హైలైట్. అమాయకంగా కనిపించే కుమార్ బాబు పాత్రలో ఆది ఒదిగిపోయాడు. రంగమ్మత్త పాత్రలో అనసూయ కొత్తగా అనిపిస్తుంది. గ్లామర్ గా కనిపిస్తూనే చక్కటి నటన కనబరిచింది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు ఎప్పటిలానే తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది. సినిమాలో మిగిలిన నటీనటులు సహజంగా తమ పాత్రలకు అనుగుణంగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
పల్లెటూరి ఎన్నికల నేపధ్యంలో సాగే కథను చాలా రియలిస్టిక్ గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు సుకుమార్. అతడికి దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ మార్కులు పడతాయి. ప్రతి ఫ్రేమ్ లో కూడా సుకుమార్ స్టయిల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తను అనుకున్న కథను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా రూపొందించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలను చిత్రీకరించిన తీరును మరింత మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. అప్పటి పరిస్థితులను గుర్తు చేసే విధంగా రూపొందించిన సెట్స్ బాగున్నాయి. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి టెక్నీషియన్ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నా.. కంటెంట్ చాలా బలంగా ఉండడంతో ఆ భావన ఎక్కడా కలగదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
విశ్లేషణ:
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఎంతో దూరంగా చక్కటి కథ, కథనాలతో పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వల్ కు ముందు ఎన్నికల్లో పోటీ చేస్తున్నమంటూ ప్రెసిడెంట్ కు ఇద్దరు అన్నదమ్ములు ఇచ్చే వార్నింగ్ హైలైట్ గా నిలుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం ఖాయం. ప్రీక్లైమాక్స్ సన్నివేశాల్లో కుమార్ బాబు పాత్ర చనిపోయినప్పుడు కథ మరింత ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ కు పెద్ద ట్విస్ట్. ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో సినిమాను ముగించిన తీరు బాగుంది.
ఫైనల్ గా చెప్పాలంటే.. రంగస్థల నాటకానికి కన్నీటి చప్పట్లు.