తారాగణం:
నటీనటులు: నితిన్, మేఘా ఆకాష్, లిజీ, సీనియర్ నరేష్ తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రమణియం
నిర్మాతలు: త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి
కథ: త్రివిక్రమ్
దర్శకత్వం: కృష్ణచైతన్య
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న టైంలో ఎక్స్పరిమెంట్ జోనర్ ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు నితిన్. ఆ దెబ్బతో మనకు యాక్షన్ ఎంటర్టైనర్లు సెట్ అవ్వవని బలంగా ఫిక్సయిపోయాడు. ఈ సారి లవ్+ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌తో ఛల్ మోహన్ రంగ అంటూ మన ముందుకు వచ్చాడు. ప్రాణ స్నేహితుడు, ఫేవరేట్ డైరెక్టర్, ఆరాధ్య నటుడు ముగ్గురు తనకు సపోర్ట్‌గా నిలబడిన ఈ సినిమాతో మరి నితిన్ సక్సెస్ కొట్టాడా లేదా తెలుసుకోవాలంటే కథలోకి ఎంటర్ అవ్వాల్సిందే.
కథ:
చిన్నప్పుడే ఒక అమ్మాయిని(మేఘాఆకాష్) చూసి ఇష్టపడతాడు మోహన రంగ(నితిన్). ఆమె చదువుకోసం అమెరికా వెళ్లిందని తెలుసుకొని తను కూడా వెళ్ళాలనుకుంటాడు. కొన్నాళ్ళకు ఆమెను మర్చిపోయినా.. అమెరికా వెళ్లాలనే ఆశను మాత్రం చంపుకోడు. ఎలాగోలా కష్టపడి వీసా అయితే సంపాదిస్తాడు. అలా అమెరికా వెళ్ళిన మోహన్ ఉద్యోగం కోసం నానా తంటాలు పడుతుంటాడు. అదే సమయంలో తనకు మేఘా(మేఘా ఆకాష్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. మొదట్లో మోహన్ ను చూసి చిరాకు పడే మేఘా కొద్దిరోజులకే అతడిని ఇష్టపడడం మొదలుపెడుతుంది. మోహన్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కానీ అనుకోని సంఘటనల వలన ఇద్దరూ విడిపోతారు. మళ్ళీ ఇద్దరూ ఒకటయ్యారా..? మోహన్ తను చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి మేఘానే అని తెలుస్తుందా..? అనేదే మిగిలిన కథ.
కళాకారుల పనితీరు:
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది నితిన్ నటన. కామెడీ టైమింగ్, పంచ్ లతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో నితిన్ తో చేయించిన కామెడీ హైలైట్ గా నిలిచింది. సినిమాలో ఉన్న ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. తెరపై అతడు చేసిన అల్లరి మామూలుగా లేదు. చాలా సరదాగా కనిపించే పాత్రలో నితిన్ ఇమిడిపోయాడు. మేఘా ఆకాష్ తెరపై అందంగా కనిపించింది. వంక పెట్టలేని విధంగా నటించింది. స్క్రీన్ పై నితిన్, మేఘాల కెమిస్ట్రీ బాగా పండింది. హీరో తండ్రిగా నరేష్ చెప్పే డైలాగులు నవ్విస్తాయి. చాలా కాలం తరువాత తెరపై నటి లిజీని చూడడం కొత్తగా అనిపిస్తుంది. నితిన్, లిజీల కామెడీ సీన్లు బాగున్నాయి. రావు రమేష్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో స్నేహితులుగా కనిపించిన పమ్మి శ్రీనివాస్, మధునందన్ లు బాగా ఎంటర్టైన్ చేశారు. నర్రా శ్రీనుకి మంచి పాత్ర దక్కింది. చివరి ఇరవై నిమిషాలు డాక్టర్ గా కనిపించి తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.
సాంకేతికవర్గం పనితీరు:
తమన్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం రెండూ ఆకట్టుకున్నాయి. 'పెద్దపులి' పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ పాటలో నితిన్ డాన్స్ పొగడాల్సిందే. ప్రతి పాటలో కొరియోగ్రఫీ అధ్బుతంగా ఉంది. వాటి చిత్రీకరించిన తీరు సినిమాకు మరో ప్లస్ అయింది. నటరాజన్ సుబ్రమణియం సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అమెరికా, ఊటీ వంటి ప్రాంతాలను తెరపై ఎంతో అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. త్రివిక్రమ్ అందించిన కథ కావడంతో డైలాగుల్లో ప్రాస కాస్త ఎక్కువైంది. దాదాపు అన్ని డైలాగ్స్ ప్రాసలతో నింపేశారు. ఇక దర్శకుడిగా కృష్ణచైతన్యకు సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. కామెడీ జోడించడంతో ఎంటర్టైనింగ్ గా అనిపించింది. కానీ మేకింగ్ తన స్టయిల్ లో కాకుండా త్రివిక్రమ్ ను ఫాలో అయినట్లుగా అనిపిస్తుంది.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో 'రంగస్థలం' తప్ప మరో హిట్ సినిమా లేకపోవడం ఈ సినిమాకు కలిసొస్తుందనే చెప్పాలి. క్లాస్ సినిమాలు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలనుకునే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. పైగా ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తి కామెడీ, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలతో సినిమా సరదాగా సాగిపోతుంది. మాస్ ఆడియన్స్ ను మెప్పించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీకెండ్ లో కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే వారు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఫైనల్ గా చెప్పాలంటే.. కామెడీ బాగా వర్కవుట్ అయింది