తారాగణం:
నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిజ
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ స్వింగ్లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఎంటర్టైన్మెంట్ పక్కా. కథ ఎలా ఉన్నా.. టేకింగ్ ఎలా ఉన్నా సరే.. యావరేజ్ అనుకున్న సినిమాలను సైతం తన నటనతో గెలుపు మెట్లు ఎక్కించగల సత్తా నాని సొంతం. అందుకే నాని నిర్మాతల హీరోగా మారిపోయారు. తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. డ్యూయెల్ రోల్, మేర్లపాక గాంధీ దర్శకుడు కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి నాని ఈ ఇయర్ ఫస్ట్ హిట్ కొట్టాడా..?
కథ:
కృష్ణ(నాని) చిత్తూరులో ఆకతాయిగా తిరిగే ఓ అబ్బాయి. అదే ఊరికి చెందిన రియా(రుక్సార్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రియా కూడా కృష్ణను ఇష్టపడుతుంది. ఇది ఇలా ఉండగా.. యూరప్ లో ఓ పెద్ద రాక్ స్టార్ అర్జున్(నాని) ప్లేబాయ్ లా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఓసారి సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కోసం మంచివాడిలా తయారవుతాడు. అయితే కృష్ణ, అర్జున్ ఇద్దరూ కూడా రియా, సుబ్బలక్ష్మిలను కలుసుకోవడానికి ఒకేరోజు హైదరాబాద్ కు వస్తారు. కానీ అక్కడ ఇద్దరమ్మాయిలు కిడ్నాప్ కు గురవుతారు. దానికి కారణం ఓ ముఠా అని తెలుస్తుంది. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరిది..? అమ్మాయిలను కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటి..? వారి నుండి కృష్ణ, అర్జున్ తమ ప్రియురాళ్లను కాపాడుకుంటారా..? అనేదే మిగిలిన సినిమా.
కళాకారుల పనితీరు:
నేచురల్ స్టార్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. కృష్ణ అనే పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు. కృష్ణ, రియాల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రియా పాత్రలో రుక్సార్ బాగానే నటించింది. గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఇక నాని నటించిన మరో పాత్ర అర్జున్. రాక్ స్టార్ గా నాని పెర్ఫార్మన్స్ అంతంతమాత్రంగానే ఉంది. నిజానికి ఆ పాత్రలో ఉండాల్సిన యాటిట్యూడ్ నాని చూపించలేకపోయాడు. వేషధారణ కూడా పెద్దగా సెట్ కాలేదు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం బాగా నటించాడు. బ్యాక్ గ్రౌండ్ నాని నటించిన రెండు పాత్రలను బాగా ఎలివేట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ చాలా అందంగా కనిపించింది. నటన పరంగా కూడా ఆకట్టుకుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో నటుడు మహేష్ చేసిన కామెడీ అంతాఇంతా కాదు. బ్రహ్మాజీ తనదైన స్టయిల్ లో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రతినాయకుల పాత్రల్లో కనిపించిన కొందరు ఆకట్టుకోలేకపోయారు.
సాంకేతికవర్గం పనితీరు:
సినిమా ప్రధాన ఆకర్షణ హిప్ హాప్ తమిజ అందించిన సంగీతం. ప్రతి పాట కూడా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. నేపధ్య సంగీతం మరో హైలైట్ గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ బాగుంది. కానీ యాక్షన్ సన్నివేశాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో కత్తిరించాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా తప్పులు దొర్లాయి. దర్శకుడిగా మేర్లపాక గాంధీ రాసుకున్న కథలో కొత్తదనం లేదు. దానికి తగ్గట్లు కథనం మరింత పేలవంగా సాగింది. ప్యారలల్ గా నడిచే స్క్రీన్ ప్లేను ఆకట్టుకునే విధంగా నడిపించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష అనే చెప్పాలి. డైలాగ్స్ బాగున్నాయి. గతంలో తన చిత్రాలతో మెప్పించిన గాంధీ ఈ సినిమా విషయంలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దర్శకుడిగా పూర్తిస్థాయిలో విజయం అందుకోలేకపోయాడు.
విశ్లేషణ:
కథలో కొత్తదనం లేకపోయినా.. నాని తనదైన స్టయిల్ లో నటించి సినిమాను రక్తి కట్టిస్తుంటాడు. 'నేను లోకల్','మిడిల్ క్లాస్ అబ్బాయి' వంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఆ ఫార్ములా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. సినిమాలో ఇద్దరు నానిలు కనిపిస్తున్నా.. స్క్రీన్ ప్లే పరంగా దొర్లిన కొన్ని తప్పుల కారణంగా ఆడియన్స్ కు సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ 'కృష్ణార్జున యుద్ధం' కాస్త నిరాశను మిగల్చడం ఖాయం.
ఫైనల్ గా చెప్పాలంటే.. నానికి దూకుడుకి బ్రేక్.