తారాగణం:
నటీనటులు: ప్రభుదేవా, సనత్ రెడ్డి, ఇందూజ, దీపక్, అనీష్, గజరాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: తిరు
సంగీతం: సంతోష్ నారాయణ్
ఎడిటింగ్: వివేక్ హర్షన్
నిర్మాత: కార్తికేయన్ సంతానం, జయనిథిల్
దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్
కథ:
ఐదుగురు స్నేహితులు హాలిడే గడపడానికి పాండిచ్చేరి ప్రాంతానికి వెళ్తారు. వీరు పుట్టుకతోనే మూగ, చెవిటి వాళ్ళు. రాత్రిపూట సరదాగా కారులో వెళ్లిన వీళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తారు. ఆ యాక్సిడెంట్ కారణంగా ఒక వ్యక్తి(ప్రభుదేవా) చావుకి కారణమవుతారు. ఆ శవాన్ని మూసివేసిన మెర్క్యూరీ ఫ్యాక్టరీలో పడేస్తారు. మరుసటిరోజు ఉదయం ఊరి నుండి వెళ్లిపోవాలనుకుంటారు. అయితే వారికి సంబంధించిన ఐప్యాడ్ అదే ఫ్యాక్టరీలో ఎక్కడో పడిపోయిందని గుర్తిస్తారు. దానికోసం తిరిగి అక్కడకు వెళ్తారు. అలా వెళ్లిన వారు తిరిగి వచ్చారా..? అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
కళాకారుల పనితీరు:
సినిమాలో ప్రభుదేవా తప్ప మిగిలిన నటీనటులందరూ కూడా తమిళ వారే కావడంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. కానీ నటన పరంగా వారి హావభావాలను మెచ్చుకొని తీరాల్సిందే. ఒక్కొక్క స్నేహితుడు దూరమవుతుంటే మిగిలిన వారు మదన పడే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తాయి. సినిమాకు ప్రధాన ఆకర్షణ ప్రభుదేవా యాక్టింగ్. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఇమిడిపోయాడు. సైకో లాంటి పాత్రను తన నటనతో రక్తి కట్టించాడు. క్లైమాక్స్ లో అతడి పాత్రకు ఎమోషన్ యాడ్ చేయడం బాగుంది. ఇప్పటివరకు ప్రభుదేవాను నెగెటివ్ యాంగిల్ లో చూడని ఆడియన్స్ కు ఈ సినిమా సర్ప్రైజింగ్ గా ఉంటుంది.
సాంకేతికవర్గం పనితీరు:
హారర్, థ్రిల్లర్ సినిమాల నుండి ఆడియన్స్ ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. ఒక మూకీ సినిమాను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా అదే సమయంలో కథలో ఎమోషన్ మిస్ కాకుండా చూసుకోవడం మామూలు విషయం కాదు. కానీ తన దర్శకత్వ ప్రతిభతో ఆ పని చాలా సులువని నిరూపించాడు. తెరపై కథను డీల్ చేసిన విధానం మెచ్చుకొని తీరాల్సిందే. అతడికి తిరు కెమెరా వర్క్ మరింత హెల్ప్ అయింది. కొన్ని షాట్స్ ఇలా కూడా చేయొచ్చా.. అనే విధంగా ఉంటాయి. ఫ్లిప్ షాట్స్ హైలైట్ గా నిలిచాయి. ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. నేపధ్య సంగీతం, సౌండ్ డిజైనింగ్ సినిమా స్థాయిని మరింత పెంచాయి.
విశ్లేషణ:
ముప్పై ఏళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు 'పుష్కక విమానం' అనే మూకీ సినిమాను తెరకెక్కించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కార్తిక్ సుబ్బరాజ్ ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించాడు. మాటలు లేకుండా చిన్న చిన్న సౌండ్స్ తో సినిమాను ఎంగేజింగ్ గా మలిచాడు. ఎప్పుడైతే సినిమాలో ప్రభుదేవా పాత్ర ఎంటర్ అవుతుందో.. సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. క్లైమాక్స్ కొత్తగా అనిపిస్తుంది. కొన్ని హాలీవుడ్ సినిమాల ప్రభావం ఈ సినిమాపై కనిపించినా.. ఆడియన్స్ మాత్రం మంచి థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయం.
ఫైనల్ గా చెప్పాలంటే.. అనుభవించాల్సిన సైలెంట్ థ్రిల్లర్