రివ్యూ: జార్జి రెడ్డి
November 22,2019 11:09 AM
నటీనటులు: సందీప్ మాధవ్, అభయ్, సత్యదేవ్, శత్రు, మనోజ్ నందన్, ముస్కాన్ తదితరులు
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: సుధాకర్ యక్కంటి
నిర్మాత: అప్పిరెడ్డి, సంజీవ్‌రెడ్డి
దర్శకత్వం: జీవన్‌రెడ్డి
తెలుగులో
బయోపిక్ సినిమాల హవా పెరిగింది. ఇప్పటికే తెలుగులో బయోపిక్ కథలతో
సినిమాలు చేయడం మొదలు పెట్టారు. మహానటి సినిమాతో బయోపిక్ కు శ్రీకారం
చుట్టారు. ఇదే కోవలో ఇపుడు స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి జీవితం ఆధారంగా
సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ స్టూడెంట్
లీడర్ జీవితం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా తెలుసుకుందాం.
కథ:
జార్జిరెడ్డి
గురించి చాలామందికి తెలుసు. చదువుకున్న వ్యక్తులకు అయన గురించి తెలుసు.
అయితే, పల్లెల్లో ఉండే వ్యక్తులకు అయన గురించి పెద్దగా తెలియదు. ఈ సినిమా
ద్వారా ఎవరు ఏంటి అనే విషయాలు తెలిపే ప్రయత్నం చేశారు. కథలోకి వెళ్తే...
జార్జిరెడ్డి చిన్నప్పటి నుంచి కూడా అన్యాయాలను ప్రశ్నించే స్వభావం కలిగిన
వ్యక్తి. చిన్నతనం నుంచి అలాంటి కథలు వింటూ దేశం గురించి
ఆలోచిస్తూండేవాడు. కొత్త కొత్త విషయాలు గురించి తెలుగుకోవాలనే తాపత్రయం
పడేవాడు. అటువంటి జార్జి రెడ్డి యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం
సంపాదిస్తాడు. ఇక చదువు అంటే తెలియని అభిమానం. చదువుకు ఎక్కువగా
ప్రాధాన్యత ఇచ్చేవాడు. పై చదువుల కోసం యూనివర్సిటీలో చేరుతాడు. అక్కడ
విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ నాయకుడిగా ఎదుగుతాడు. రైతుల సమస్యలపై
ప్రశ్నిస్తాడు. దేశంలో ఉండే యూనివర్సిటీల్లో ఉస్మానియాలో జరుగుతున్న
విప్లవం గురించి తెలిసేలా చేస్తాడు. ఇదే సమయంలో ఉస్మానియా క్యాంపస్ లో
అలజడులు జరుగుతాయి. ఈ అలజడిలో జార్జి రెడ్డిని కొంతమంది ఓ పధకం ప్రకారం
హత్య చేస్తారు. ఇదంతా తెలిసిన కథే. అయితే, తెరపై చూపించిన విధానంపై ఆసక్తి
నెలకొన్నది.
విశ్లేషణ:
కొత్త
కథేమీ కాదు. తెలిసిన కథే. జరిగిన కథే. అయితే జరిగిన కథను సినిమాటిక్ గా
మార్చి తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. జార్జి రెడ్డి బాల్యం,
పెరిగిన విధానం, పోరాడే తత్త్వం ఇవన్నీ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా
ఉంటాయి. చిన్నప్పటి దృశ్యాలు ఆ తరువాత వచ్చే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
జరిగే సన్నివేశాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
విశ్వవిద్యాలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తిని కలిగించే విధంగా
చిత్రీకరించారు. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం
చేశారు. వాస్తవికతను చూపిస్తూనే సినిమాటిక్ ను జోడించి ఆసక్తిని పెంచాడు
దర్శకుడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొంత ఇబ్బందిని
కలిగించింది. ఇక సెకండ్ హాఫ్ కథ పెద్దగా లేకపోవడంతో అక్కడక్కడే
తిరుగుతుంది. ఇదే ఇబ్బంది కలిగించింది. జార్జి రెడ్డి గురించి పూర్తిగా
తెలిసిన వాళ్లకు ఈ కథలో కొత్తదనం కనిపించదు. అయితే, ఇప్పటి స్టూడెంట్స్ కు
సినిమా ఆకట్టుకుంటుంది. జార్జిరెడ్డిని హత్య చేసిన తీరు ప్రతి ఒక్కరిని
కదిలిస్తుంది.
నటీనటుల పనితీరు:
జార్జి
రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్ నటించిన తీరు మెప్పించింది. నటుడిగా మరో
స్థాయికి తీసుకెళ్లింది. సందీప్ కు పెద్దగా అనుభవం లేకపోయినా వంగవీటి
సినిమాలో మెప్పించినట్టుగానే జార్జి రెడ్డి సినిమాలో కూడా మెప్పించాడు.
జార్జి రెడ్డిగా సందీప్ ఒదిగిపోయి మెప్పించాడు. నిజంగా జార్జి రెడ్డి
ఇలానే ఉంటాడేమో అనుకునేంతగా ఒదిగిపోయి నటించాడు. సినిమాలో దాదాపుగా అందరు
కొత్త వ్యక్తులనే తీసుకున్నారు. సత్యదేవ్, మనోజ్ నందం, చైతన్య కృష్ణ
తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
సాంకేతికంగా
సినిమా మెప్పించింది. దర్శకుడిగా జీవం రెడ్డి మెప్పించాడు. కెమెరా, కళా
ఆకట్టుకున్నాయి. జార్జి రెడ్డి గురించి చాలా మందికి తెలుసు కాబట్టి
పరిధిదాటి వెళ్లకుండా.. దాదాపుగా ఉన్నది ఉన్నట్టుగా తీసి మెప్పించారు.
పాజిటివ్ పాయింట్స్:
జార్జి రెడ్డి కథ
సాంకేతిక నిపుణుల ప్రతిభ
నటీనటులు
మైనస్ పాయింట్స్:
సాగతీత సన్నివేశాలు
మిస్సైన భావోద్వేగాలు
చివరిగా:
జార్జిరెడ్డి జీవితంలో జరిగిన అనేక కోణాలను ఆధారంగా తీసుకొని తెరక్కించిన
జార్జి రెడ్డి నిజజీవితంలోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా ఆకట్టుకునే
ప్రయత్నం చేశాడు.