నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మల్దాస్ వీధిలో జరిగింది. ఇద్దరు దుండగులు అతడ్ని కిరాతకంగా నరికి తల, మొండెం వేరు చేశారు. అనంతరం ఈ పని చేసింది తామే అని వీడియో విడుదల చేశారు. మృతుడు కన్హయ్యలాల్ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్దాస్ వీధి ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అదనంగా 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. మరోవైపు, ఈ దారుణానికి పాల్పడిన అగంతకులు ఆ హత్యను స్వయంగా వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందంటూ ఆ వీడియోలో హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటనను రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఖండించారు. ఈ హత్యతో సంబంధం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరూ సోషల్ మీడియా షేర్ చేయవద్దని కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా.. ఉదయ్‌పుర్ జిల్లాలో 24 గంటలపాటు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ హత్యపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన ఉదయ్‌పూర్ ఎస్పీ.. కొందరు నిందితులను గుర్తించినట్లు చెప్పారు. వారి జాడ తెలుసుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యువకుడ్ని చంపింది తామే అని వీడియో విడుదల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.