తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో.. ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తమ్ముడు, ప్రియుడుతో కలిసి.. భర్తను హతమార్చింది. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్ ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైన అతనికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. హసీనా కొంతకాలం నుంచి స్థానికంగా ఉండే మహబూబ్ బాషా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త మందలించినా మారకపోవడంతో.. గ్రామంలో పంచాయితీ పెట్టించాడు.
గ్రామ పెద్దలు హసీనా ప్రియుడు మహబూబ్ బాషాను మందలించి, మరో గ్రామానికి పంపించారు. అయినా ఇద్దరిలో మార్పు రాలేదు. తరచూ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన భర్త హుసేన్.. మరోసారి హసీనాని మందలించాడు. దీంతో.. అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని, తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్‌బాషాతో కలసి కుట్ర పన్నింది. గత నెల 13న పిల్లల్ని తన తల్లి ఇంటికి పంపించిన హసీనా.. రాత్రి 10 గంటలకు భర్త ఇంటికి రాగానే, వాళ్లిద్దరితో కలిసి గొంతు నొక్కి చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్టుగా.. ఆస్తమాతో ఊపిరాడక చనిపోయాడని కథలు అల్లింది.
అయితే.. హుసేన్ సోదరుడికి అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించాడు. తన అన్నయ్య చావుకి ఆస్తమా కాదని, ఇతర కారణాలున్నాయని ఫిర్యాదు చేశాడు. దీంతో.. పోస్టుమార్టం నిమిత్తం దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. భార్యే ఈ హత్య చేయించిందని తెలిసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే తమ్ముడు, ప్రియుడితో కలిసి స్కెచ్ వేసిందని ధృవీకరించారు.