వాళ్లు ముగ్గురు.. ఆమె మాత్రం ఒక్కతే. వాళ్లు చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు, అంతే తెలివిగా ఆ మహిళ ప్రవర్తించింది. ఇంకేముంది.. ప్లాన్ మొత్తం తేడా కొట్టేసింది. మరో దారి లేక ఆ దొంగలు ఒక్కసారిగా పరుగు లంకించారు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రం అదాజన్‌లోని సీకే విల్లా సొసైటీలో జిగ్యాసా తేజస్ అనే మహిళ సింగిల్‌గానే ఉంటోంది. ఈ విషయం గ్రహించిన ముగ్గురు దొంగలు.. ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు.
ప్లాన్ ప్రకారం.. కార్పొరేషన్ ఉద్యోగులుగా మారువేషం వేసుకొని, ఆ మహిళ ఇంటికి వెళ్లి, వాటర్ ట్యాంక్ తనిఖీ చేసేందుకు వచ్చామని చెప్పారు. చూడ్డానికి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరే కనిపించడంతో.. ఆమె లోనికి అనుమతించింది. ఇంట్లో వెళ్లాక కాస్త బిల్డప్ ఇచ్చిన ఆ దొంగలు.. క్లోరోఫామ్ ఇచ్చారు. అయితే, ఆమె గాబరా పడకుండా తెలివి ప్రదర్శించింది. మూర్చపోయినట్టు నాటకం ఆడింది. ఆమె మత్తులోకి జారుకుందనుకున్న దొంగలు తమ పనిలో నిమగ్నమయ్యారు.
అదును చూసుకున్న జిగ్యాసా.. వెంటనే బయటకు పరుగులు తీసింది. ‘ఇంట్లో దొంగలు పడ్డారు’ అంటూ గట్టిగా కేకలు వేసింది. ఈ దెబ్బతో ఖంగుతిన్న ఆ ముగ్గురు దొంగలు.. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.